#Top Stories

Israel misses the target?… ఇజ్రాయెల్‌ టార్గెట్‌ మిస్‌?.. ఇరాన్‌ ఎంబసీపైకి మిస్సైళ్లు! 11 మంది మృతి

గాజా సంక్షోభ నేపథ్యంలో.. ప్రత్యర్థి దేశాలపై ఇజ్రాయెల్‌ తన దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సోమవారం సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై దాడి జరిపింది. ఈ దాడిలో మొత్తం 11 మంది మృతి చెందారు. అయితే ఈ దాడి ఎంబసీ లక్ష్యంగా జరిగి ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు.

గాజా యుద్ధంలో  ఇరాన్‌ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(IRGC)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌, సిరియా దౌత్య విభాగాలు ఇది ఇజ్రాయెల్‌ దాడేనని ధృవీకరించాయి. ఆరు మిస్సైల్స్‌ ఎంబసీ భవనంపైకి దూసుకొచ్చాయని.. ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్స్‌ ద్వారా ఇజ్రాయెల్‌ రక్షణ దళం ఈ దాడికి తెగబడిందని ప్రకటించాయి. 

మరోవైపు బ్రిటన్‌ తరఫున  సిరియాలో పని చేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఒకటి  ఈ క్షిపణి దాడిపై ప్రకటన చేసింది. దాడిలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని..  ఎనిమిది మంది ఇరాన్‌, ఇద్దరు సిరియా, ఒక లెబనీస్‌ సైనికులు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలోనే సిరియా భూభాగంలో ఇజ్రాయెల్‌ జరిపిన ఐదో దాడి ఇది.

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు ఇరాన్‌ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్‌ తరఫున పలు గ్రూపులు ఇక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇజ్రాయెల్‌ సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే.. గాజా సంక్షోభం తర్వాత ఈ దాడుల ఉధృతిని పెంచింది. 

మిస్‌ టార్గెట్‌?
సిరియాలో ఇరాన్‌ ఎంబసీ దాడిపై ఇజ్రాయెల్‌ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ దాడి ఇరాన్‌ దౌత్య కార్యాలయం లక్ష్యంగా జరగలేదని.. దానిని ఆనుకుని ఉన్న భవనం టార్గెట్‌గా జరిగి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు ఇస్తున్నారు. భవనానికి ఖాసీం సోలెయిమానీ భారీ కటౌట్‌ ఉండడంతో అందులో ఉన్న సభ్యుల్ని టార్గెట్‌ చేసుకుని దాడులు జరిపి ఉంటుందని సదరు కథనాల సారాంశం. మిడిల్‌ ఈస్ట్‌లో ఇరాన్‌ మిలిటరీ ఆపరేషన్స్‌కి సోలెయిమానీని ఆద్యుడిగా పేర్కొంటారు. అయితే.. 2020లో సిరియా భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడుల్లో  సోలెయిమానీ చనిపోయాడు. 

ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించక తప్పదు
సిరియా రాజధానిలో ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్‌ క్షిపణుల దాడిని లెబనాన్‌ రెబల్‌ గ్రూప్‌ హిజ్బుల్లా ఖండిచింది. ఐఆర్‌జీసీ సభ్యుల మరణానికి కారణం అయినందుకు ఇజ్రాయెల్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాజా యుద్ధంలో హమాస్‌కు ఇటు హిజ్బుల్లా, అటు ఐఆర్‌జీసీలు మిత్రపక్షంగా ఉన్నాయి.    

Israel misses the target?… ఇజ్రాయెల్‌ టార్గెట్‌ మిస్‌?.. ఇరాన్‌ ఎంబసీపైకి మిస్సైళ్లు! 11 మంది మృతి

RBI made a key announcement on Rs.2

Leave a comment

Your email address will not be published. Required fields are marked *