Pakistan captain change.. Rizwan’s best choice: Shahid Afridi పాక్ కెప్టెన్ మార్పు.. రిజ్వాన్ బెస్ట్ ఛాయిస్: షాహిద్ అఫ్రిది

పాకిస్థాన్ జట్టుకు మళ్లీ కెప్టెన్‌గా వచ్చిన బాబర్ అజామ్‌పై షాహిద్ అఫ్రిది తన అక్కసు వెళ్లగక్కాడు. బాబర్ కంటే రిజ్వాన్ మంచి ఎంపిక అవుతుందని వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్లో కెప్టెన్సీ వ్యవహారంపై రగడ కొనసాగుతూనే ఉంది. గత వన్డే ప్రపంచ కప్ తర్వాత సారథ్యం నుంచి తప్పించిన బాబర్ అజామ్‌కే మళ్లీ కెప్టెన్సీ అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. వన్డే, టీ20 జట్టు పగ్గాలను అతడికి అప్పగించిన బోర్డు.. టెస్టులకు మాత్రం షాన్ మసూద్‌నే కొనసాగించింది. తన అల్లుడు షహీన్ అఫ్రిదిని టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించడంతో.. మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి స్పందించాడు. బాబర్‌కు బదులు మహమ్మద్ రిజ్వాన్‌కు అప్పగించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
‘‘పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో అత్యంత అనుభవం కలిగిన క్రికెటర్లు ఉన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదైనా మార్పు చేయాలనుకుంటే మహమ్మద్ రిజ్వాన్ మంచి ఎంపిక అవుతుంది. కానీ, ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. నా పూర్తి మద్దతు పాకిస్థాన్ జట్టుకు ఉంటుంది. బాబర్ అజామ్‌కు శుభాకాంక్షలు’’ అని అఫ్రిది పోస్టు పెట్టాడు.
షహీన్ కూడా సారథి మార్పుపై అంగీకరించాడని.. ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని సమాచారం. కేవలం ఒక్క సిరీస్‌తోనే అతడి కెప్టెన్సీపై ఓ అభిప్రాయానికి రావడం సరైంది కాదనే చర్చ మొదలైంది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోనూ లాహోర్ జట్టును సరిగ్గా నడిపించలేకపోయాడనే విమర్శలూ వచ్చాయి. ఈ సీజన్లో చివరి ప్లేస్‌లో నిలిచింది. వ్యక్తిగత ప్రదర్శనలోనూ నిలకడ లోపించింది. దీంతో వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో పాక్ జట్టును నడిపించడానికి అనుభవం కలిగిన కెప్టెన్ వైపే బోర్డు మొగ్గు చూపినట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు.