#Telangan Politics #Telangana

Kavitha Liqour Policy Case : లిక్కర్‌ స్కాంలో ఇవాళ.. : కవితకు బెయిల్‌ వచ్చేనా?

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ కింద ప్రస్తుతం ఆమె తీహార్‌ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ  ఆమె వేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. 

తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్‌ 16 వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే.. మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నదని, కవిత పలుకుబడి ఉన్న రాజకీయనేత అని, బెయిల్‌ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్‌ ఇవ్వొద్దంటూ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) విజ్ఞప్తి చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న మరిన్ని వాదనలు వింటామని చెబుతూ.. విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వేసిన సాధారణ బెయిల్‌ పిటిషన్‌నూ విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు కోరే అవకాశం కనిపిస్తోంది. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్‌ 9వ తేదీ వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.

తీహార్‌ అధికారుల తీరుపై.. 
ఇదిలా ఉంటే.. కోర్టు ఆమెకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించే సందర్భంలో కవిత కొన్ని విజ్ఞప్తులు చేశారు. జైల్లో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తి కావేరీ బవేజాను కోరారు. దీంతో ఇంటి నుంచి భోజనం, దుస్తులు, మంగళసూత్రం ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. అయినప్పటికీ తీహార్‌ జైలు అధికారులు వాటికి అనుమతివ్వడం లేదంటూ కవిత తరఫు న్యాయవాది ఈనెల 28న మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విచారణ సందర్భంగా కవిత తరఫున న్యాయవాదులు ఈ అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. ఒకవేళ మధ్యంతర బెయిల్‌ ఊరట దక్కని పక్షంలో..  జైల్లో రిమాండ్‌ ముగిసేవరకు ఆ వసతులైనా కల్పించేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరే అవకాశం కనిపిస్తోంది.

ముగియనున్న కేజ్రీవాల్‌ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. కేజ్రీవాల్‌ను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్లు సమచారం. దీంతో కోర్టు మరోసారి కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తుందా.. లేదా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుందా? అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. రిమాండ్‌ విధిస్తే మాత్రం ఆయన్ని తీహార్‌ జైలుకు తరలిస్తారు.  కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 22వ తేదీన ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Kavitha Liqour Policy Case : లిక్కర్‌ స్కాంలో ఇవాళ.. : కవితకు బెయిల్‌ వచ్చేనా?

Telangana : Harish Rao’s letter to CM

Leave a comment

Your email address will not be published. Required fields are marked *