#Telangan Politics #Telangana

Telangana Cm Revanthreddy : గ్రేటర్‌పై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్న హస్తం పార్టీ

 ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ దీటైన వ్యూహం

 3 ఎంపీ స్థానాలతోపాటు రాబోయే బల్దియా ఎన్నికలే లక్ష్యం

 రంగంలోకి సీఎం రేవంత్‌, పార్టీ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ

 హైదరాబాద్‌:గ్రేటర్‌ హైదరాబాద్‌పై పూర్తి స్థాయి పట్టు బిగించేందుకు అధికార కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభంజనం వీచినా.. నగరంలో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈసారి మహానగర పరిధిలోని నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కనీసం మూడింటిలో సత్తా చాటేందుకు పక్కా స్కెచ్‌ వేసింది. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసేందుకు బలమైన నేతలపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగిస్తోంది. లోక్‌సభ సీట్లను గెలవడంతో పాటు రాబోయే రోజుల్లో బల్దియా పీఠాన్ని దక్కించుకునే వ్యూహంతో గులాబీ పార్టీలోని కీలక నేతలకు గాలం వేస్తోంది. బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఒక్కొక్కరు టచ్‌లోకి వచ్చి అధికార పక్షం గూటికి చేరుతున్నారు.

బలమైన నేతలకు గాలం..
ఇప్పటికే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పార్టీలో చేరి సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్ధిగా ఖరారు కాగా.. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌రెడ్డి దంపతులు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియోద్దీన్‌, పలువురు కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరారు. తాజాగా శనివారం జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. మరికొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సైతం హస్తం గూటికి చేరేందుకు క్యూలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వాస్తవంగా గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ల లోక్‌సభ స్థానంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. దీంతో పట్టు కోసం బీఆర్‌ఎస్‌లో గుర్తింపు దక్కని బలమైన నేతలను కాంగ్రెస్‌లోకి ఆకర్షిస్తోంది.

‘హస్త’గతమే లక్ష్యం..
► 
మహానగర పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌ల హస్తగతమే లక్ష్యంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ స్పీడ్‌ పెంచినట్లు కనిపిస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌ మున్షీ రంగంలోకి దిగారు. వాస్తవంగా గ్రేటర్‌ పరిధిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల పరంగా బీఆర్‌ఎస్‌కు గట్టి బలం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా 39 స్థానాలు గెలిస్తే.. అందులో 16 అసెంబ్లీ స్థానాలు గ్రేటర్‌ పరిధిలోనివే కావడం విశేషం.

 2014 ముందు వరకు కార్పొరేటర్ల వరకే పరిమితమైన బీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వివిధ పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. టీడీపీని పోరులో లేకుండా చేయడంతోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలుపుకుంది. ఇక జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌ పక్షాన 56 మంది కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ పక్షాన ముగ్గురు కార్పొరేటర్లు ఎన్నిక కాగా, అందులో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లలో డజన్‌ మందికి పైగా ఇప్పటికే హస్తం గూటికి చేరారు. ఇక గులాబీ పార్టీలోని మిగిలిన కార్పొరేటర్లలో మరో 20మంది వరకు వారం రోజుల్లో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో బీఆర్‌ఎస్‌ అనుసరించిన విధానాన్ని కాంగ్రెస్‌ కూడా అదే దారిలో నడిచి సక్సెస్‌ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పూర్వవైభవం కోసం..
గ్రేటర్‌లో ఒకప్పుడు సత్తా చాటిన కాంగ్రెస్‌.. మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో వైఎస్‌ హయాంలో గ్రేటర్‌లో తిరుగులేని స్థానాలను కై వసం చేసుకున్న కాంగ్రెస్‌ ఆ తర్వాత చతికిలపడింది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో గ్రేటర్‌లో ఒక్క స్థానాన్ని కూడా కై వసం చేసుకోలేకపోయింది. అప్పట్లో ఎన్నికల బరిలోకి దిగిన హేమాహేమీలంతా ఓటమి చవిచూశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీడీపీ పొత్తుతో వివిధ స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయగా ఎల్‌బీనగర్‌ నుంచి సుధీర్‌రెడ్డి, మహేశ్వరం నుంచి సబితారెడ్డి మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత వారు కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా అధికారంలోకి రావడంతో తిరిగి పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *