#Telangan Politics #Telangana

BRS Telangana : Harishrao పార్టీకి నష్టం చేసిన వారిని వదిలిపెట్టం

వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం: ఎమ్మెల్యే హరీశ్‌రావు  

ఆరు నెలలు ఓపిక పట్టండి, భవిష్యత్‌ మనదే 

వంద రోజుల పాలనలో కాంగ్రెస్‌ ఒరగబెట్టిందేమీ లేదు 

బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం 

గజ్వేల్‌: పార్టీకి నష్టం చేసిన వారిని వదిలిపెట్టేదిలేదని, అన్ని లెక్కలు రాసి పెడుతున్నామని వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. శనివారం సిద్దిపేట జి ల్లా గజ్వేల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయ కుల సమావేశం మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలలు ఓపిక పట్టండి.. భవిష్యత్‌ మనదే అంటూ నాయకులకు భరోసా ఇచ్చారు. భూకబ్జాలకు పాల్పడిన వారు మాత్రమే ప్రస్తుతం పార్టీ మారుతున్నారని దుయ్యబట్టారు. వంద రోజుల పాలనలో కాంగ్రెస్‌ ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని ఆరోపించారు.

ప్రభుత్వ విధానాల వల్ల ఆర్టీసీ, పౌరసరఫరాల కార్పొరేషన్లు దివాళా తీయడం ఖాయమన్నారు. పింఛన్‌ రూ.4వేలకు పెంపు, రైతు బంధు రూ.15వేలకు పెంపు, వ్యవసాయకూలీలకు రూ.12వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.150 కోట్ల పనులను రద్దు చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక పెద్దగా చేసిందేమీ లేకుండా ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దుబ్బాకలో మోసం చేస్తే బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావును బండకేసి కొట్టారని చెప్పారు.

గజ్వేల్‌పై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ రఘునందన్‌కు ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రఘునందన్‌పై గ్రామస్థాయిలో చర్చ పెట్టాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2న గజ్వేల్‌లో నియోజకవర్గస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపుపై కార్యాచరణ రూపొందించుకుందామని చెప్పారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏడున్నరేళ్లు జాయింట్‌ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేసే అవకాశం కల్పించిన మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావును ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు.

రూ.100 కోట్లతో స్థాపించాలనుకుంటున్న పీవీఆర్‌ ట్రస్టు ద్వారా కార్యకర్తల పిల్లలకు విస్తృతంగా విద్యావకాశాలు కలి్పస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పదవులు అనుభవించిన వారే పార్టీలు మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *