Chandra babu: Quit Jagan Save Rayalaseema క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ : ప్రొద్దుటూరు సభలో చంద్రబాబు

జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాలు విసిరారు.
ప్రొద్దుటూరు: జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు.
‘జగన్‌కు రాయలసీమ అంటే హింస, హత్యా రాజకీయాలు.. తెదేపాకు సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. రైతును రాజు చేయడం తెదేపా సంకల్పం. పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మేది లేదంటున్నారు. విపరీతమైన మార్పు వచ్చింది.. ట్రెండ్ మారింది.. వైకాపా బెండు తీస్తారు. వైకాపా నేతల దాడులకు తెదేపా కార్యకర్తలు భయపడలేదు. కడపకు స్టీల్‌ప్లాంట్ వచ్చి ఉంటే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవి. శంకుస్థాపనలు కాదు.. ప్రారంభోత్సవాలు జరగాలి. రాయలసీమకు మేం కియా మోటార్స్ తీసుకొచ్చాం. కరవుసీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయి. నా బ్రాండ్ కియా మోటార్స్ తేవడం.. జగన్ బ్రాండ్ వేసిన స్టీల్‌ప్లాంట్‌కు మళ్లీ శంకుస్థాపన చేయడం..! పరిశ్రమలు తేకపోగా.. ఉన్నవాటిని తరిమేశారు’’
‘‘జగన్‌కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలుసా..? రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కల. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి. ఆ సంకల్పంతోనే 72 శాతం పనులు పూర్తి చేశాం. ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా..? రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ నినాదం కావాలి. ఈ అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.