Haiti: Went to interview the gang leader.. గ్యాంగ్‌లీడర్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లి.. బందీగా మారి..!

సాయుధ మూకల దాడులతో కరీబియన్ దేశం హైతీ(Haiti) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అలాంటి చోట ఒక గ్యాంగ్ లీడర్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన యూట్యూబర్ ఒకరు కిడ్నాప్ అయ్యారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..
గ్యాంగ్ లీడర్ జిమ్మీ చెరిజియర్ అలియాస్ బార్బెక్యూ (Jimmy Cherizier alias Barbecue)ను ఇంటర్వ్యూ చేసేందుకు అమెరికన్ యూట్యూబర్ అడిసన్ పిర్రే మాలౌఫ్.. హైతీకి వెళ్లాడు. అతడు YourFellowArab పేరిట ఒక ఛానల్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే ఆ దేశానికి వెళ్లిన కొద్దిగంటల వ్యవధిలో మరో గ్యాంగ్ 400 మావోజో.. అతడిని కిడ్నాప్ చేసింది. మార్చి 14న ఈ ఘటన జరగ్గా ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అడిసన్ యూట్యూబ్ ఛానల్‌ను 1.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సాధారణ ప్రజలు వెళ్లడానికి భయపడే ప్రమాదకరమైన ప్రదేశాలను అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలోనే జిమ్మీని ఇంటర్వ్యూ చేసేందుకు హైతీ వెళ్లాడు. అయితే అతడిని కిడ్నాప్ చేసిన మావోజో గ్యాంగ్.. ఆరులక్షల డాలర్లు డిమాండ్ చేస్తోంది. అడిసన్ బందీగా మారిన విషయాన్ని తోటి యూట్యూబర్లు ధ్రువీకరించారు. అతడి విడుదలకు అమెరికా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
సాయుధ గ్యాంగుల ఒత్తిడి నేపథ్యంలో ఇటీవల హైతీ ప్రధాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సంక్షోభానికి జిమ్మీ ప్రధాన కారకుడని అనుమానాలున్నాయి. తన స్థాయిని ప్రపంచానికి తెలియజేయాలని తహతహలాడుతుంటాడు. తరచూ అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే అడిసన్ అతడిని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది.