#Cinema

Rashmika: విజయ్‌ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?

నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు  ‘ఎక్స్’ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు

విజయ్ దేవరకొండ , మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). పరశురామ్‌ దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం గురువారం ట్రైలర్‌ విడుదల చేసింది. దీనిని చూసిన రష్మిక టీమ్‌ను మెచ్చుకుంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు.

‘‘నాకెంతో ఇష్టమైన విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. ఏప్రిల్‌ 5వ తేదీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. మీరు తప్పకుండా హిట్‌ కొడతారు. పార్టీ కావాలి!’’ అని అడిగారు. దీనిపై విజయ్‌ స్పందిస్తూ ‘క్యూటెస్ట్’ అని రిప్లై ఇచ్చారు.

తిరుపతిలో జరిగిన ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు. ‘‘స్వామివారి దర్శనం కోసం ఇప్పటికే చాలాసార్లు తిరుపతి వచ్చా. ఈ ప్రాంతం నుంచి మా సినిమా ప్రమోషన్స్‌ మొదలు పెట్టడం ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. పరశురామ్‌తో ఇప్పటికే ‘గీత గోవిందం’ చేశా. దానిని మించి ఈ సినిమా ఉండనుంది. యాక్షన్‌, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా అన్నీ ఉన్న మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నాం. ఈ వేసవి సెలవుల్లో మీరు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. రిలీజ్‌ తర్వాత మీ అందరినీ కలుస్తా’’ అని అన్నారు.

‘లైగర్‌’ పరాజయం తర్వాత హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన నటించిన గత చిత్రం ‘ఖుషి’ మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. దీంతో ఆయన ఆశలన్నీ ‘ఫ్యామిలీ స్టార్‌’పైనే పెట్టుకున్నారు. ఇందులో విజయ్‌ మధ్య తరగతి వ్యక్తిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *