MS Dhoni: మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం

సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై జట్టు ఐపీఎల్ 17వ సీజన్లోనూ దూసుకుపోతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తరఫున తొలిసారి మెగా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అయితే, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. ఇదే విషయాన్ని ఓ కార్యక్రమంలో రచిన్ వద్ద యాంకర్ ప్రస్తావించింది. ‘‘మీరు క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత ధోనీ వైపు చూశారా? అప్పుడు అతడు ఎలా రియాక్ట్ అయ్యాడు? మీకేమైనా చెప్పాడా?’’ అని అడిగింది. ఆ ఈవెంట్లోనే ఉన్న ధోనీ వెంటనే మైక్ అందుకొని సమయస్ఫూర్తి ప్రదర్శించాడు.
‘‘మాకు కొత్త కెప్టెన్ (రుతురాజ్‌ను చూపిస్తూ) ఉన్నాడు’’ అంటూ చెప్పడంతో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత ధోనీ కొనసాగిస్తూ.. ‘‘మెగా లీగ్‌లో తొలిసారి ఆడుతున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అయితే. నేను ఇలాంటి వాటికి రియాక్ట్ కాను. ఇప్పుడు నేనెవరిని? నాకు తెలిసి రుతురాజ్ కూడా ఇలానే ఆలోచిస్తాడు. రచిన్ ఆటను చూస్తుంటే ముచ్చటేస్తోంది’’ అని వ్యాఖ్యానించాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.
ముంబయిపై రికార్డు హాఫ్ సెంచరీ సాధించిన హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో చెత్త షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. దీనిపై భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందించాడు. ఒకవైపు అభినందిస్తూనే.. సున్నితంగా హెచ్చరించాడు. ‘‘అభిషేక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడావు. కానీ, అంతటి చెత్త షాట్‌కు ఔట్ కావడం మంచిది కాదు. మరోసారి పునరావృతమైతే మాత్రం నీ కోసం దెబ్బలు సిద్ధంగా ఉంటాయి. క్లాసెన్ సూపర్ క్లాస్ గేమ్’’ అని యువీ పోస్టు పెట్టాడు.
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ మెంటార్ సౌరభ్ గంగూలీ, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కాస్త గందరగోళానికి గురయ్యారు. విదేశీ క్రికెటర్‌ను వాడుకొనే క్రమంలో రాజస్థాన్ నిర్ణయంపై ఫోర్త్ అంపైర్‌తో గంగూలీ, పాంటింగ్ తీవ్రంగా చర్చలు జరిపిన వీడియోలు వైరల్‌గా మారాయి. రోవ్‌మన్ పావెల్‌ను ఫీల్డింగ్ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకొనేందుకు రాజస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఇలా చేస్తే ఐదుగురు ఓవర్సీస్ ప్లేయర్లను ఆడించినట్లు అవుతుందనేది దిల్లీ వాదన. కానీ, ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఏ సమయంలోనూ మైదానంలో నలుగురికి మించి విదేశీ క్రికెటర్లు ఆడకూడదు. ఒకవేళ ఎవరినైనా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా తీసుకోవాలంటే మరొక ఓవర్సీస్ ప్లేయర్ స్థానంలోనే భర్తీ చేయాలి. అలాగే ఫైనల్ 11లో నలుగురికి మించి విదేశీ క్రికెటర్లు జట్టులో ఉండకూడదు. ఇప్పుడు రాజస్థాన్ విషయానికొస్తే.. తొలుత ముగ్గురు విదేశీ ప్లేయర్లను తుది జట్టులోకి తీసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా హెట్మయర్ స్థానంలో నాండ్రీ బర్గర్‌ను తీసుకుంది. అప్పుడు ఫీల్డింగ్ సమయంలోనూ మైదానంలో ముగ్గురు విదేశీ క్రికెటర్లే ఉన్నారు. దీంతో రోవ్‌మన్ పావెల్‌ను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకొనేందుకు రాజస్థాన్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.