South Africa: Bus fell into the valley.. 45 people died..South Africa: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక

దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు.
జొహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతిచెందారు. 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ కోసం చర్చికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 165 అడుగుల లోతులో బస్సు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు స్థానిక రవాణా శాఖ పేర్కొంది.
మొత్తం 46 మందితో కూడిన బస్సు బోట్స్వానా నుంచి మోరియాకు బయలుదేరింది. కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపుతప్పడంతో బస్సు లోయలో పడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సైతం చనిపోగా, ప్రాణాలతో బతికున్న బాలికను సమీప ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటన వివరాలను బోట్స్వానా అధ్యక్షుడితో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా పంచుకున్నారు. మృతుల కుటుంబాలకు ఇరుదేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు. ఈస్టర్ వీకెండ్ నేపథ్యంలో వంతెనపై వీపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని స్థానిక యంత్రాంగం తెలిపింది. ప్రయాణికులు వెళ్లాలనుకున్న జియాన్ చర్చ్ ఆ దేశంలో ఉన్న పెద్ద చర్చిల్లో ఒకటి.