#Trending

Drugs Container Seized In vizag Port : సీజ్‌ చేసిన కంటెయినర్‌

విశాఖ పోర్టుకు ఈస్ట్‌ మాటున డ్రగ్స్‌ దిగుమతి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బ్రెజిల్‌ నుంచి ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ను దిగుమతి చేసుకోగా, అందులో నిషేధిత మాదకద్రవ్యాల అవశేషాలు ఉన్నట్లు సీబీఐ పరీక్షల్లో నిర్ధారించిన విషయం తెలిసిందే

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ పోర్టుకు ఈస్ట్‌ మాటున డ్రగ్స్‌ దిగుమతి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బ్రెజిల్‌ నుంచి ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ను దిగుమతి చేసుకోగా, అందులో నిషేధిత మాదకద్రవ్యాల అవశేషాలు ఉన్నట్లు సీబీఐ పరీక్షల్లో నిర్ధారించిన విషయం తెలిసిందే. ఎంత మొత్తంలో డ్రగ్స్‌ కలిశాయో తెలుసుకునేందుకు నమూనాలను సీఎఫ్‌ఎస్‌ఎల్‌ (సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌)కి పంపారు. సీజ్‌ చేసిన కంటెయినర్‌ ప్రస్తుతం విశాఖ కంటెయినర్‌ టెర్మినల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వీసీటీపీఎల్‌) ఎగ్జామినేషన్‌ పాయింట్‌లో ఉంది. అన్ని వాతావరణ పరిస్థితులనూ తట్టుకునే ప్రదేశానికి ఈ కంటెయినర్‌ను తరలించాలని తొలుత భావించినా, ప్రస్తుతం ఉన్న బెర్త్‌లో ఆ సౌకర్యం లేకపోవడంతో, సీబీఐ మరికొన్ని రోజులపాటు ఆ కంటెయినర్‌ను అక్కడే ఉంచాలని నిర్ణయించింది. దీనిపై కస్టమ్స్‌ అధికారులకు లేఖ రాసింది.

విశాఖ కస్టమ్స్‌ శాఖ ఆధ్వర్యంలో ఓ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఉంది. ఇందులో ఈస్ట్‌లో ఎంత గ్రేడ్‌ డ్రగ్స్‌ ఉన్నదీ గుర్తించే అవకాశం ఉంది. అయితే సీబీఐ నార్కొటిక్‌ కిట్లతో డ్రగ్స్‌ అవశేషాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించాక, ఎంత పరిమాణంలో డ్రగ్స్‌ కలిశాయన్న నివేదికల కోసం సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. స్థానిక ల్యాబ్‌లు కాకుండా.. దిల్లీ, హైదరాబాద్‌, పుణెలో ఉన్న ల్యాబ్‌లకూ పంపి పరీక్షించే అవకాశాలున్నట్లు సమాచారం. నివేదికలు రావడానికి మూడు, నాలుగు రోజులకు పైగా పట్టే అవకాశాలున్నాయి.

డ్రగ్స్‌ కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్‌ డేటా, బ్రెజిల్‌కు నగదు లావాదేవీలపై ఇప్పటికే ఆరా తీశారు. సీబీఐ బృందం బ్రెజిల్‌కు వెళ్లి విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. జర్మనీకి వెళ్లిన నౌక రెండు రోజులు అక్కడే ఎందుకు ఆగిందనే కోణంలో విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. సీఫుడ్‌ ఎగుమతిదారులు కొందరికి సీబీఐ ఫోన్‌ చేసి ఏయే దేశాలకు ఎగుమతి చేస్తారు? ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఎక్కడున్నాయనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. రొయ్యల ఆహారం తయారీ యూనిట్ల యాజమాన్యాలతోనూ డ్రైడ్‌ ఈస్ట్‌ ఏ స్థాయిలో ఉపయోగిస్తారు? ఎక్కడ నుంచి దిగుమతి చేసుకుంటారనే అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

కేసు విచారణలో ఉన్నందున విశాఖను వదిలి ఎక్కడికీ వెళ్లకూడదని సంధ్య ఆక్వా ప్రతినిధులకు సీబీఐ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. యు.కొత్తపల్లి మండలం మూలపేటలోని సంధ్య ప్రాసెసింగ్‌ యూనిట్‌లో తనిఖీ చేస్తున్నరోజే… సమీపంలోని ఓ కాలనీకి రికార్డులు, బిల్లుల వోచర్లు, చెక్‌బుక్‌లు కంపెనీ బస్సులో తెచ్చారు. ఈ రికార్డులను పోలీసులు సీబీఐకి కాకుండా, సంస్థ ప్రతినిధులకే ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *