ANDHRA ELECTION : Allotment of uncountable seats in BJP..బీజేపీలో సీట్ల కేటాయింపులు గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అన్ని పార్టీల్లో కంటే బీజేపీలో సీట్ల కేటాయింపులు గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే బీజేపీలో ఇంకా అభ్యర్థుల ప్రకటన మాత్రం జరగడం లేదు. ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఆశావహులు అయోమయంలో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అన్ని పార్టీల్లో కంటే BJP సీట్ల కేటాయింపులు గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే బీజేపీలో ఇంకా అభ్యర్థుల ప్రకటన మాత్రం జరగడం లేదు. ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఆశావహులు అయోమయంలో పడ్డారు. తమకు చివరి క్షణంలో అయినా టికెట్ వస్తుందా.. రాదా.. అనే అనుమానంలోకి వెళ్తున్నారు. పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీ దాదాపు లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించేసింది. జనసేన కూడా తనకున్న పరిధిలో జాబితాను విడుదల చేసింది. ఎట్నుంచి చూసినా బీజేపీలో మాత్రమే ఇంకా సీట్ల పంచాయితీ ఒక పంచాన రాలేదు. గత 6 రోజులుగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరీ, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఢిల్లీలోనే మకాం వేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అఫీసుకు ఎవరూ రావడం లేదు. ఎన్నికల వేళ పార్టీ జెండాలతో నాయకుల రాకపోకలతో కళకళలాడాల్సిన పార్టీ ఆఫీసులు బోసిపోయి కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దమైంది కమలం పార్టీ. అయితే ఇప్పటి వరకు ఒక్క సెగ్మెంట్‌లో కూడా అభ్యర్థిని ప్రకటించక పోవడం కాషాయ పార్టీలో కలవరం పుడుతోంది. దీనికి కారణం అసలు బీజేపీ, వలస బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనపై ఢిల్లీ కేంద్రంగా కసరత్తు కొనసాగుతోంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ అభ్యర్థులకు గానూ 139లో టీడీపీ, 21లో జనసేన పోటీ చేస్తున్నప్పటికీ మిగిలిన స్థానాల్లో ఎవరిని బరిలో దింపాలి అన్న దానిపై సందిగ్దత నెలకొంది. దీంతో బీజేపీ, టీడీపి, జనసేన మధ్య కొన్ని స్థానాల్లో ఇంకా లెక్కలు తేలడం లేదు. హస్తినలో నిన్న అర్ధరాత్రి వరకు బీజేపీ సీఈసీ మీటింగ్ కొనసాగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు సాగింది. బీజేపీ అభ్యర్థులకు సంబంధించి ఇవాళ మరో జాబితా విడుదల చేసే అవకాశం కూడా ఉంది. తెలంగాణ, ఏపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో పోటీచేసే ఆరుగురి పేర్లు విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు బీజేపీ పెద్దలు. అయితే అభ్యర్థుల ప్రకటన వచ్చే వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈరోజైనా బీజేపీ నుంచి ఏపీ ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తున్నారు అనే ఉత్కంఠకు తెరపడుతుందా.. లేక మరిన్ని రోజులు జాప్యం అవుతుందా వేచి చూడాలి.