Ponnam : Complained to CS about RDO recording phone call ఫోన్‌కాల్ రికార్డు చేసిన ఆర్డీవోపై సీఎస్‌కు ఫిర్యాదు చేశా: పొన్నం

తన ఫోన్ కాల్ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్, కమలాపూర్, న్యూస్‌టుడే: తన ఫోన్ కాల్ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్డీవోపై సీఎస్ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవితో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినట్లుగా ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో ఈ నెల 15న వైరల్ అయింది. ఆ సమయంలో మంత్రి మాట్లాడినప్పుడు తహసీల్దారు మాధవితోపాటు అప్పటి హనుమకొండ ఆర్డీవో రమేశ్ కుమార్ ఫోన్‌లైన్‌లో ఉన్నారు. ఈ ఆడియో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేతికి వెళ్లడం, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో మంత్రి స్పందించారు. ఆడియో లీక్ చేశారంటూ ఆర్డీవోపై ఫిర్యాదు చేశారు.
మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొన్నం మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. గత సెప్టెంబరులో సరైన వర్షాలు పడలేదు. 2022-23 వాతావరణ నివేదికను ప్రజలకు తెలియజేస్తాం. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలకు సింగూరు, గోదావరి, కృష్ణా, ఉస్మాన్‌సాగర్ నుంచి నీటిని తీసుకుంటున్నాం. అవసరమైతే బూస్టర్ పైపుల ద్వారా నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తరలిస్తాం. ఎల్లంపల్లి నుంచి కూడా 3 టీఎంసీలు నగరానికి తరలిస్తున్నాం. కరవును ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సహకరించాలి. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
బండి సంజయ్ అవినీతిపరుడు..
నా తల్లిని అవమానించిన దుర్మార్గుడు బండి సంజయ్. ఆయన అవినీతిపరుడని రాష్ట్రం మొత్తం కోడై కూస్తోంది. సంజయ్ అవినీతిపరుడు కాదని కిషన్‌రెడ్డి చెప్పగలరా? మాజీ మంత్రి గంగుల కమలాకర్, సంజయ్.. ఇద్దరూ లోపాయికారీ మిత్రులు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో గట్టి పోటీ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.