#Trending

Everything is ready for the first meeting of NDA.. PM Modi will attend : ఏపీలో ఎన్డీయే మొదటి సభ కోసం సర్వం సిద్దం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ప్రారంభించింది. ఎన్‌డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటు, వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ప్రారంభించింది. ఎన్‌డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటు, వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. దక్షిణ భారతంలో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకపోవడం, విజయాలను రుచి చూడకపోవడంతో ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ప్రధాని మోదీ తెలుగుదేశం పార్టీని మరోసారి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనలతో కలిపి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది బీజేపీ.

తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఒకే వేదికపై నుండి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. ఇందుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో మార్చి17న జరగనున్న బహిరంగసభ వేదిక కానుంది. సభను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేయబోతుందనే విషయాన్ని ఈ సభా వేదిక నుంచి వెల్లడిస్తామని నేతలు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి మొదటి బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు ఖరారైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న బహిరంగసభకు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద 300 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 225 ఎకరాలు వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్‌లకు కేటాయించారు. 75 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక, వీఐపీ, ప్రజలకు వేర్వేరుగా బారికేడ్లతో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. కూటమి సభ నిర్వహిస్తున్న బహిరంగసభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారు.

ప్రధాని మోదీ రాక సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎస్పీజీ సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించటంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ప్రధాని మోదీ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హాజరవుతున్నందున 7 హెలిప్యాడ్‌లు నిర్మించారు. బొప్పూడి సభ ద్వారా కూటమి ఎన్నికల ప్రణాళికను ప్రజలకు పరిచయం చేయనున్నారు. 2019 ఎన్నికలకు ముందే చంద్రబాబు ఎన్డియేలో నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇప్పడే తిరిగి ఎన్డియేలోకి వెళ్ళారు. అయితే 2014 లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆతర్వాత ఇప్పుడే ముగ్గురు ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలంటూ టీడీపీ, బీజేపీ, జేఎస్పీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *