Gaami: Low rating for ‘Gami’.. Vishwak ‘గామి’కు కావాలనే తక్కువ రేటింగ్.. లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ విశ్వక్ పోస్ట్

తన సినిమాకు కావాలనే ఫేక్ రేటింగ్ ఇస్తున్నారని హీరో విశ్వక్సేన్ మండిపడ్డారు.
విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గామి’ (Gaami). తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అయితే, సినిమా విడుదలైనప్పటి నుంచి కొందరు తక్కువ రేటింగ్ ఇస్తున్నారని చిత్రబృందం పోస్ట్‌లు పెడుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై విశ్వక్ స్పందించారు. ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ విడుదల చేశారు.
‘‘గామి’ని ఇంతపెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు, సినీ ప్రియులకు ధన్యవాదాలు. దీని రేటింగ్ విషయంలో నా దృష్టికి వచ్చిన సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నా. కొందరు ఈ చిత్రానికి 10కు1 రేటింగ్ ఇచ్చి దెబ్బతీయాలని చూస్తున్నారు. రకరకాల యాప్స్ వాడి ఫేక్ రేటింగ్ ఇవ్వడం వల్ల 9ఉన్న రేటింగ్ ఒక్కసారిగా 1కు పడిపోయింది. మీరు ఎన్నిసార్లు కిందకు లాగినా రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తాను. ఇలాంటి పనులు ఎవరు,ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ, ఎలాంటి సందర్భంలోనైనా మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. ‘గామి’ని సపోర్ట్ చేస్తోన్న ఆడియన్స్, మీడియాకు ధన్యవాదాలు. ఈ వ్యవహారంపై చట్టపరంగా ముందుకు వెళ్తాను’ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
విశ్వక్ అఘోరాగా కనిపించిన ఈ చిత్రంతో విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రయోగాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దీనిపై గతంలో ఓ సందర్భంలో విశ్వక్ మాట్లాడుతూ.. ఆరేళ్లు కష్టపడినట్లు చెప్పారు. మాస్ డైలాగ్స్, ఉర్రూతలూగించే పాటలు, ఫైట్లు ఉండకపోయినా సినిమాను ఎంజాయ్ చేస్తారని హామీ ఇచ్చారు.