Indiramma houses for the poor and deserving : పేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
భద్రాచలంలో పథకానికి సీఎం శ్రీకారం
దళితులు, గిరిజనులకు రూ.లక్ష అదనంగా ఇస్తామని భట్టి వెల్లడి
పేదల చిరకాల కోరిక.. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవం.. ఇందిరమ్మ ఇల్లు. భద్రాద్రి రాముడు, ఆడబిడ్డల ఆశీర్వాదంతో భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లే. ఇంటి పెత్తనం తమ చేతిలో ఉంటే దాన్ని చక్కదిద్దే బాధ్యతను ఆడబిడ్డలు తీసుకుంటారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే మంజూరు చేస్తున్నాం. పేదలు, అర్హులకే ఇళ్లు ఇస్తాం. కోటీశ్వరులకు ఇవ్వం. హడావుడిగా ప్రారంభించి అటకెక్కించం.
ఖమ్మం: రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామన్నారు. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు మైదానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ఆవిష్కరించారు. జిల్లాకు చెందిన ఆదివాసీ, గిరిజన మహిళలు 21 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే మోదీ, కేసీఆర్ ఓట్లడగాలి
‘‘2014 ఎన్నికలకు ముందు ‘పండగ రోజు బిడ్డ, అల్లుడు వస్తే ఎక్కడ ఉంటారు? గొర్రె, మేక పిల్లలు ఎక్కడ కట్టేస్తారు’ అంటూ పేదల సొంతింటి కలలపై కేసీఆర్ వ్యాపారం చేశారు. సొంతిల్లు లేక, కిరాయి కట్టలేక.. గుడిసెలోనో, వేరే ఇంట్లోనో ఉన్న పేదలు.. కేసీఆర్ ఏదో చేస్తారని ఆశించారు. ఆయన చెప్పిన కథే మళ్లీ మళ్లీ చెప్పి.. ఎన్నికల్లో ఓట్లు పొందారు. ప్రజలను మోసం చేశారు. ఆ మోసాలకు, అబద్ధాలకు కాలం చెల్లింది. కేసీఆర్, భారాసలను ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు తెచ్చుకున్నారు. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది. భారాస హయాంలో ఇళ్లు కట్టిన గ్రామాల్లోనే కేసీఆర్ ఓట్లు అడగాలి. 2022 వరకు దేశంలోని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని గత ఎన్నిలకు ముందు భాజపా మ్యానిఫెస్టోలో పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇళ్లు కట్టించారో భాజపా నేతలు చెప్పాలి. ఆ పథకం కింద ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే భాజపా ఓట్లు అడగాలి. ఇందుకు భారాస, భాజపాలు సిద్ధమా? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ, పెట్టుబడి దక్కక లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. కనీస మద్దతు ధర కోసం దిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేస్తుంటే మోదీ ప్రభుత్వం తుపాకీ తూటాలు పేల్చి రైతులను బలితీసుకుంది. నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పారు. 15 పైసలైనా వేయలేదు. 2014 ఎన్నికలకు ముందు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పారు. అలా చేస్తే తెలంగాణకు కనీసం 60-70 లక్షల ఉద్యోగాలు వచ్చేవి.
మూడు నెలల్లోనే హామీల అమలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. సుమారు 24 కోట్ల పైచిలుకు జీరో టికెట్లను మహిళలు పొందారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. రూ.500కే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తున్నాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం: భట్టివిక్రమార్క
రాష్ట్ర చరిత్రలో సోమవారం సువర్ణాధ్యాయంతో లిఖించదగిన రోజు అని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ‘‘ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాద్రి రాములవారి సన్నిధిలో ప్రారంభించుకోవటం శుభపరిణామం. పదేళ్లుగా సొంతింటి కోసం నిరుపేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేలా పథకం అమలుకు శ్రీకారం చుట్టాం. మా పథకాలు నిరుపేదల కళ్లల్లో ఆనందం కోసమే. దళితులు, గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల కోసం అదనంగా రూ.లక్ష చొప్పున ఇస్తాం. వారికి రూ.6 లక్షలిస్తాం. గత పాలకుల మాదిరిగా ప్రజల సొమ్మును దోచుకోం. ప్రతి పైసా పేదల కోసం ఖర్చు చేస్తాం’’ అని భట్టి అన్నారు.
ఆ 17 లక్షల మందికి త్వరలో నివాస పట్టాలు: పొంగులేటి
భారాస పాలనలో వాగ్దానాలే తప్ప ఆచరణ శూన్యమని గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ‘‘భారాస మాదిరిగా మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. గతంలోనూ నిరుపేదలకు గూడు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాం. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం. గతంలో ఇళ్లు పొందిన 17 లక్షల మందికి త్వరలో నివాస పట్టాలు పంపిణీ చేస్తాం’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల, సురేఖ, సీతక్కలతో కలిసి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. సీఎం సంప్రదాయ వస్త్రాలు ధరించి.. స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీరామనవమి ఉత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులకు వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు ప్రసాదం, రాములవారి ప్రతిమలు అందజేశారు.