Kala Jatheri Marriage: గ్యాంగ్‌స్టర్, లేడీ డాన్‌ల పెళ్లికి గ్యాంగ్‌వార్ ముప్పు? భారీ పోలీసు బందోబస్తు!

దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలోగల సంతోష్ మ్యారేజ్ గార్డెన్‌లో గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడి, లేడీ డాన్ అనురాధల వివాహం నేడు (మార్పి 12) జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయితే గ్యాంగ్‌వార్ ముప్పును దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్ గార్డెన్‌లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అతిథులను బార్ కోడ్ ద్వారా గుర్తించి, ప్రవేశం కల్పించనున్నారు.
మ్యారేజ్ గార్డెన్‌లో పలు సీసీటీవీలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మ్యారేజ్ హాల్ చుట్టూ ఉన్న రోడ్లను కూడా ఎప్పటికప్పుడు సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాలుగు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు ఈ వివాహంపై దృష్టి పెట్టాయి. గ్యాంగ్ వార్ ముప్పు దృష్ట్యా సంతోష్ గార్డెన్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు, దుకాణాలను పోలీసులు మూసివేయించారు.
రెండు రోజుల క్రితం ఐదుగురు షూటర్లను పోలీసులు మ్యారేజ్ గార్డెన్ సమీపంలో అరెస్ట్ చేశారు. కాలా జఠేడికి పలు ముఠాల నుండి ముప్పు ఉంది. వాటిలో బంబిహా గ్యాంగ్ పేరు మొదట వినిపిస్తుంది. బంబిహా గ్యాంగ్‌కి చెందిన షూటర్లు కాలా జఠేడితో పాటు అతని గ్యాంగ్‌పై దాడి చేయడానికి నిత్యం వెదుకుతుంటారని పోలీసులు దగ్గర సమాచారం ఉంది. గ్యాంగ్‌స్టర్, లేడీ డాన్‌ల వివాహ వేదికను పూలతో అందంగా అలంకరించారు. అతిథులు కూర్చునేందుకు అద్భుతమైన సోఫాలను ఏర్పాటు చేశారు. అతిథుల విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.