We Will Do Justice In PRC REVANTHREDDY పీఆర్సీలో న్యాయం చేస్తాం

తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ(పీఆర్సీ)లో తగిన న్యాయం చేస్తామని, నాలుగు పెండింగ్ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ(పీఆర్సీ)లో తగిన న్యాయం చేస్తామని, నాలుగు పెండింగ్ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సీపీఎస్ రద్దును పరిశీలిస్తామని, బదిలీలు, పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీఐ)లో ఆదివారం ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఐఎన్టీయూసీ నేత సంజీవరెడ్డి, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వంలో మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదు.. చర్చలే. ఇప్పటికే మీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. కేసీఆర్ ప్రభుత్వం సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే… ప్రజలు ఆ సర్కారును గద్దె దించారు. ప్రభుత్వ శాఖలవారీగా సంఘాలు ఉండాల్సిందే. ఇద్దరు, ముగ్గురితో కొన్ని రిజిస్టర్డ్ సంఘాలుంటాయి. అలా కాకుండా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలి. వాటితో మంత్రివర్గ ఉపసంఘం శాఖలవారీగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుంది. గుర్తింపు సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోం. రెగ్యులర్ పోస్టుల్లో నుంచి విశ్రాంత ఉద్యోగులను తొలగించి పదోన్నతులకు ఆటంకం లేకుండా చూస్తాం. విశ్రాంత ఉద్యోగుల సేవలు అవసరమనుకుంటే ఓఎస్డీలుగా నియమించుకుంటాం. కోదండరాం పేరును ఎమ్మెల్సీ పదవి కోసం మరోసారి గవర్నర్‌కు సిఫార్సు చేస్తాం. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికే గౌరవం.
జీవో 317 సమస్యలను పరిష్కరిస్తాం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం. బడుల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తాం. ప్రతినెలా హెడ్మాస్టర్ల ఖాతాల్లో డబ్బులు వేసి.. వారికి వేతనాలు చెల్లిస్తాం. జీవో 317 సమస్యలను పరిష్కరిస్తాం. మొదటి తేదీన ఉద్యోగులకు జీతాలు వేసినా మేం ప్రచారం కల్పించుకోలేదు. మూడు నెలల్లో దాదాపు 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 11 వేల పైచిలుకు కొలువులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశాం. రోజుకు 18 గంటలు పనిచేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం. ఇ-కుబేర్‌లో పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించేందుకు ఆదేశాలిస్తాం.
సంఘాల పోరాటంతోనే తెలంగాణ ఏర్పాటు..
ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నదీ, అధికారంలో ఉన్నదీ కేసీఆర్ కుటుంబమే. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా సాధించానని చెప్పుకొంటే.. అది అబద్ధం. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ సిద్ధించింది. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తమూ చిందలేదేమో గాని.. తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారు. శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపుముద్దలయ్యారు. తెలంగాణ బాపు అని కేసీఆర్ తనకు తానే చెప్పుకొంటున్నారు. తెలంగాణకు బాపు.. ప్రొఫెసర్ జయశంకర్’’ అని సీఎం పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, టీజీవో, టీఎన్జీవో, పీఆర్టీయూటీఎస్, ట్రెసా, డిప్యూటీ కలెక్టర్ల సంఘాల నేతలు ఏలూరి శ్రీనివాస్‌రావు, జగదీశ్వర్, శ్రీపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ, యూటీఎఫ్, ఎస్టీయూ, టీఆర్టీఎఫ్, సీపీఎస్టీఈయూ, జీటీఏ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, విద్యుత్, ఆర్టీసీ, సీపీఎస్, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్యల నేతలు ఈ సందర్భంగా సీఎంకు తమ సమస్యలను నివేదించారు.