విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు.. వీడియో వైరల్

అమెరికా లోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా దాని టైరు ఊడిపడింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే దారిమళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం గురువారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్‌లోని ఒసాకాకు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే వెనుక వైపున ల్యాండింగ్ గేర్‌లోని ఓ టైరు ఊడిపోయింది. అది విమానాశ్రయంలోని పార్కింగ్ లాట్లో ఉన్న కారుపై బలంగా పడింది. దీంతో వాహనం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
టైరు ఊడిన విషయాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని దారిమళ్లించి లాస్ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. అది సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని.. అందులోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించామని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఘటన సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు.
బోయింగ్ 777 విమానాల్లో రెండు ల్యాండింగ్ గేర్లకు ఆరు చొప్పున టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడినా, డ్యామేజ్ అయినా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఈ మోడల్‌ను డిజైన్ చేశారు. తాజా ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.