#Andhra Pradesh News #Elections

వ్యూహం మార్చిన వైఎస్సార్‌సీపీ.. మచిలీపట్నం(బందరు) అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్‌

 కృష్ణా: మచిలీపట్నం(బందరు) లోక్‌సభ అభ్యర్థి విషయంలో వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చింది. డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌పేరును తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమై మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు..   

మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని సీఎం జగన్‌ ఆయన్ని( సింహాద్రి చంద్రశేఖర్‌) కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. అందుకే సింహాద్రి చంద్రశేఖర్‌ పేరును ప్రకటిస్తున్నాం. చంద్రశేఖర్‌ ఈ ప్రాంతానికి బాగా సుపరిచితులు. ఆయన తండ్రి కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు చంద్రశేఖర్‌ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారు. ఆయన ఇక్కడికి రావడం వల్ల.. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి జరుగుతుంది అని పేర్ని నాని ఆకాంక్షించారు. 

నన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషంగా ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఇప్పటిదాకా లేను. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను అని డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇదిలా ఉంటే వైఎస్సార్‌సీపీ తరఫున గత ఎన్నికల్లో నెగ్గిన బాలశౌరికి మరోసారి టికెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేదు. దీంతో జనసేనలో చేరారాయన. దీంతో ఇక్కడి ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది వైఎస్సార్‌సీపీ.

దేశంలోనే ప్రముఖ కేన్సర్‌ వైద్యుడిగా చంద్రశేఖర్‌కు పేరుంది. దివంగత సింహాద్రి సత్యనారాయణరావు కుమారుడే చంద్రశేఖర్‌. ఆయన తండ్రి సింహాద్రి సత్యనారాయణరావు 1985 నుంచి 1999 మధ్య మూడు పర్యాయాలు వరుసగా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి గెలుపొంది దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పనిచేసింది తెలిసిందే. అయితే గత రెండు ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ పార్టీలు ప్రయత్నించినప్పటికీ సుముఖత చూపలేదు. రాజకీయాల్లో నీతి, నిజాయితీగా పనిచేసిన మంత్రిగా సింహాద్రి సత్యనారాయణరావుకి ఎంతో పేరుంది. ఆయన రాజకీయ వారసత్వంగా సింహాద్రి చంద్రశేఖర్‌ రాజకీయాల్లోకి రావడం పట్ల దివిసీమ ప్రజలు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తొలుత సింహాద్రి చంద్రశేఖర్‌ ను అవనిగడ్డ నిజయోకవర్గ ఇంఛార్జిగా, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ను మచిలీపట్నం లోక్‌సభ స్థానం ఇంఛార్జిగా ప్రకటించారు. అయితే అవనిగడ్డ ఇన్‌ఛార్జి బాధ్యతలను తన తనయుడు రామ్‌చరణ్‌కు ఇవ్వాలంటూ సీఎం జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారాయన. దీంతో ఇక ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్‌కు సీఎం జగన్‌ అవకాశం కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *