#Andhra Politics #Elections

మళ్లీ జగన్‌ భజన

ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డివిరవడాల ఊసే ఎత్తకుండా ‘ప్రతి కుటుంబానికి అంత చేశాం…ఇంత చేశాం’ అంటూ రెండేళ్లుగా ప్రజల చెవులు దిమ్మెక్కేలా ఇళ్ల ముందుకొచ్చి మరీ వాయించినా ముఖ్యమంత్రి జగన్‌కు తనివితీరినట్టు లేదు.

అమరావతి: ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డివిరవడాల ఊసే ఎత్తకుండా ‘ప్రతి కుటుంబానికి అంత చేశాం…ఇంత చేశాం’ అంటూ రెండేళ్లుగా ప్రజల చెవులు దిమ్మెక్కేలా ఇళ్ల ముందుకొచ్చి మరీ వాయించినా ముఖ్యమంత్రి జగన్‌కు తనివితీరినట్టు లేదు. వారం, పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే తరుణంలోనూ తన భజన మంత్రాన్ని వీడటం లేదు. మరోమారు ప్రజల ఇళ్ల ముంగిటకు వెళ్లి లేఖలు అందిస్తూ బాకా ఊదేందుకు సన్నద్ధమయ్యారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న గీతను ఎప్పుడో చెరిపేసి అన్నింటికీ వాలంటీర్లనే వినియోగిస్తూ నిస్సిగ్గుగా పాలించిన ఆయన.. చివరి ప్రయత్నానికీ వారినే ఉపయోగించనున్నారు. దీనికి ఠంచనుగా షెడ్యూలు ప్రకటించిన వైకాపా ప్రభుత్వం 8, 9, 10 తేదీల్లో అంటే మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్లి జగన్‌ డప్పు కొట్టాలని దిశానిర్దేశమూ చేసింది.

ఇప్పటికే ‘గడప, గడపకు మన ప్రభుత్వం’, ‘జగనే ఎందుకు కావాలి?’ ‘మా నమ్మకం నువ్వే జగన్‌’, ఇలా రకరకాల కార్యక్రమాల పేరుతో వాలంటీర్లను ఇళ్ల చుట్టూ తిప్పారు. ఇచ్చేది జగన్‌ జేబులో సొమ్మయినట్లు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక సాయం అందించినట్లు పదే పదే ప్రచారం చేశారు. ఒక పెద్ద లేఖను ముద్రించి ఇచ్చారు. అదే కుటుంబం నుంచి ఛార్జీల పెంపు, పన్నుల బాదుడు, తదితర రూపాల్లో ఎంత లాక్కున్నది మాత్రం అందులో చెప్పరు. ఇప్పుడు మళ్లీ అదే ఎత్తుగడను వేసి మరింత గట్టిగా జగన్‌ డప్పు కొట్టాలని వాలంటీర్ల చేతికి మళ్లీ రెండు పేజీల లేఖలిచ్చి ప్రజల ముందుకు పంపించబోతున్నారు. భజన గట్టిగా ఉండేందుకేనేమో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతలు వాలంటీర్లకు తాయిలాలు ఎర వేస్తున్నారు. అసత్యాలు వల్లె వేయడంలో జగన్‌ ఆరితేరిపోయారు.

ఎన్నికలు దగ్గరపడటంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇప్పుడు మరింతగా చెలరేగిపోతున్నారు. 129 హామీలిస్తే వాటిలో ఏకంగా 128 నెరవేర్చేశారట! 99 శాతం వాగ్దానాలు నెరవేర్చినట్టు లేఖలో అచ్చు వేయించుకున్నారు. మద్య నిషేధం, సీపీఎస్‌ రద్దు, ఇస్లాం బ్యాంకు ఏర్పాటు, మండలానికో వృద్ధాశ్రమం, 25 లక్షల ఇళ్లు కట్టించడం, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చిందెవరో.. వాటిని అమలు చేయకుండా గాలికొదిలేసిందెవరో జగన్‌కే తెలియాలి. ఇవే కాదు.. గత ఎన్నికల ముందు పాదయాత్ర పేరుతో ఊరూరా తిరిగి వివిధ వర్గాలకు ఇచ్చిన వందల కొద్దీ హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. ఇన్ని దాచిపెట్టి ‘చెప్పాడంటే చేస్తాడంతే’ అని ప్రచారం చేసుకోవడం నిజంగా విడ్డూరమే. ఇంటింటికీ వెళ్లి భజన చేసేటప్పుడు ఇవి కూడా చెప్పాలి కదా?

గడపగడపకూ సంక్షేమమంటూ కొత్త పల్లవి

వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసే రెండు పేజీల లేఖలో ఒకవైపు విద్య, వైద్యం, వ్యవసాయం రంగంలో సాధించింది నామమాత్రమే అయినా అపారమైన ప్రగతి సాధించామంటూ ఎప్పుడూ చెప్పే పాత చింతకాయపచ్చడి లెక్కలే ఉన్నాయి. రెండోవైపు అయిదేళ్ల కాలంలో ఒక్కో కుటుంబానికి పింఛను నుంచి కొవిడ్‌ సాయం వరకు వివిధ పథకాల కింద అందిన లబ్ధిని లెక్కగట్టి వచ్చిన మొత్తాన్ని ముద్రించారు. దీనికి గడపగడపకూ సంక్షేమమనే పేరు పెట్టారు. ఇలాంటి లేఖల్ని రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల కుటుంబాలకు అందించనున్నారు. లేఖ ఇవ్వడంతోనే వదిలేస్తే జగన్‌ గొప్పదనమేముంది? వాలంటీర్లు బాకా ఊదాల్సిందే. దాన్ని వినేందుకు వివిధ పథకాల లబ్ధిదారులందరూ చెవుల్ని ‘సిద్ధం’ చేసుకోవాల్సిందే. ఆ లేఖ అందుకున్న ప్రతి కుటుంబంలోనూ ఒకరు దాన్ని ధ్రువీకరిస్తూ యాప్‌లో వేలిముద్ర వేయాల్సిందే. ప్రతిసారీ ఇలా లేఖలు లేఖలంటూ వాటిని అచ్చేసేందుకు రూ.కోట్ల ప్రజాధనాన్ని పార్టీ ప్రచారానికి తగలేస్తూనే ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *