Rashmika – మద్దతుగా చిత్రసీమ..
ప్రముఖ కథానాయిక రష్మికని లక్ష్యంగా చేసుకుని సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు రష్మికకి మద్దతుగా నిలుస్తున్నారు. మహిళల రక్షణకి భంగం కలిగించే ఇలాంటి నకిలీలపైనా, సాంకేతికతపైనా చర్చ జరుగుతుండగా ఇలాంటి వీడియోల్ని సృష్టిస్తున్నవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ రష్మికకి అండగా నిలిచారు. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ… ‘‘మరో మహిళకి ఇలా జరగకూడదు. ఇలాంటి వాటిపై చర్యల కోసం ఓ సమర్థవంతమైన విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఘటనలకి పాల్పడేవారిని వెంటనే శిక్షించాలి. అప్పుడే మహిళలకి రక్షణ కలుగుతుంది’’ అంటూ ఓ పోస్ట్‌లో రాశారు. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘నకిలీ వీడియోల బాధితుల్లో ఒకరైన రష్మికకి నేను మద్దతుగా నిలుస్తున్నా. ఇటువంటి హానికరమైన వీడియోల్ని రూపొందించడం కోసం సాంకేతికతని దుర్వినియోగం చేయడంపై వ్యక్తిగతంగా నాతోపాటు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సమగ్ర మార్గదర్శకాల్ని అభివృద్ధి చేయడానికి ‘మా’ ఏఐ నిపుణులతో చర్చిస్తోంది’’ అని పోస్ట్ చేశారు. మరోవైపు రష్మికని లక్ష్యంగా చేసుకుని సృష్టించిన నకిలీ వీడియో కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ని కలిసి ఫిర్యాదు చేసింది.