Kerala – ఏ ఆకు కూరతో ఏం లాభమంటే..!

కేరళలోని కోజికోడ్‌లోని పుక్కాడ్‌కు చెందిన వన్నంగుని అబూబాకర్ (82) ఆకు కూరలతో కలిగే ప్రయోజనాలను యువతకు వివరిస్తూ తనకున్న భూమిలో దాదాపు 50 రకాల ఆకుకూరలను పండిస్తూ ప్రసిద్ధి చెందారు. కంటి సమస్యలు, ఊబకాయం, రక్తహీనత, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడాలంటే ఆకు కూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. మనకు దొరికే ఆకుకూరల్లోనే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. స్థానికంగా జరిగే వ్యవసాయ సమ్మేళనాల్లో పాల్గొని.. అక్కడ వేల మందికి ఆకుకూరల వల్ల కలిగే లాభాలను వివరిస్తుంటానని అబూబాకర్ తెలిపారు. ‘‘ఆకుకూరలు, పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఆకుకూరల్లో పెద్ద మొత్తంలో విటమిన్ సి, కాల్షియం, బీటా కెరోటిన్, ఫైబర్ ఉంటాయి. అవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆకుకూరల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. జీర్ణక్రియ, ఎముకల పెరుగుదలకు సాయపడతాయి’’ అని ఆయన వివరించారు. ఈ ఆకుకూరల పెంపకం, వాటి గురించి ప్రచారాన్ని అతడి కుమార్తె రజియా, అల్లుడు లతీఫ్ కూడా కొనసాగిస్తున్నారు.