Ravi Teja – త్వరలో చూస్తారు విశ్వరూపం

అడవిలో ఉంటాడు. నీడై తిరుగుతుంటాడు. కనిపించడు కానీ, వ్యాపించి ఉంటాడు. వెలుతురు వెళ్లే ప్రతి చోటుకీ… అతడి బుల్లెట్ వెళుతుంది. ఇంతకీ అతనెవరో తెలియాలంటే ‘ఈగల్’ చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా… కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ ఈ చిత్రం విడుదలవుతోంది. సోమవారం టీజర్‌ని విడుదల చేశారు. ‘కొండలో లావాని కిందకి పిలవకు… ఊరూ ఉండదు, నీ ఉనికీ ఉండదు’ అనే సంభాషణతో మొదలయ్యే ఈ టీజర్‌లో రవితేజ భిన్న గెటప్పుల్లో కనిపించడం ఆసక్తిని రేకెత్తిచ్చింది. ‘‘ఇది విధ్వంసం మాత్రమే, తర్వాత చూడబోయేది విశ్వరూపం’, ‘జనాలకి కట్టు కథ… ప్రభుత్వాలు కప్పెట్టిన కథ’ అంటూ టీజర్‌లో వినిపించే సంభాషణలు కథ, పాత్రల్లోని గాఢతని స్పష్టం చేస్తాయి. ‘‘విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. శక్తిమంతమైన ఈ కథలో, అంతే బలమైన పాత్రలో రవితేజ సందడి చేయనున్నారు. ఆయన తెరపై కనిపించే విధానం చాలా బాగుంటుంది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని టీజర్ మరింతగా పెంచింద’’న్నాయి సినీ వర్గాలు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్‌రెడ్డి, భాషౄ, శివ నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం, సంగీతం: దావ్ జాంద్.