Etala Rajender – భాజపా, భారాస ఒక్కటైతే.. గజ్వేల్లో నేనెందుకు పోటీ చేస్తా?

సీఎం కేసీఆర్ పాలనలో భారాస కార్యకర్తలకే ‘బీసీ బంధు’ దక్కిందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులు.. ఎవరూ సంతోషంగా లేరన్నారు. అసైన్డ్, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని.. రూ. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. భాజపా, భారాస ఒక్కటైతే తానెందుకు గజ్వేల్లో పోటీ చేస్తానని ఆయన ప్రశ్నించారు.
భారాస పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఈటల అన్నారు. ఆ పార్టీని గద్దె దించడం భాజపాకే సాధ్యమని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు భారాసలో చేరారని చెప్పారు.