Turkey : ఉద్రిక్తంగా మారిన పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీ..

గాజాపై ఇజ్రాయెల్ (Israel) దాడులను ఆపాలంటూ అంతర్జాతీయంగా పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాలస్తీనా ( Palestine)కు మద్దతుగా తుర్కియే ( Turkey)లో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. గాజాలో పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సోమవారం తుర్కియే వచ్చారు. ఆయన రావడానికి కొద్ది గంటల ముందు తుర్కియే రాజధాని అంకారాలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో నిరసనకారులు అంకారాలో అమెరికా సైనిక బలగాలు ఉన్న ఎయిర్‌బేస్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో తుర్కియే పోలీసులు జలఫిరంగులు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపైకి కుర్చీలు, రాళ్లు విసిరారు. పరిస్థితి మరింత దిగజారడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులను తుర్కియే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఆ దేశంలోని తుర్కియే రాయబారిని వెనక్కి పిలిచింది. మరోవైపు గాజాను నలువైపులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు.. దాడులను తీవ్రతరం చేశాయి. హమాస్ బందీలను విడిచిపెట్టేంత వరకు దాడులను ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాపై జరిగిన వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు 88 మంది ఐరాస రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి (UN) తెలిపింది. ఇప్పటిదాకా గాజాపై జరిగిన దాడుల్లో 9,700 మంది మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడించింది.