#Crime News

Chhattisgarh- మావోయిస్టుల ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేరు జిల్లాలోని తడోకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు-భద్రతా బలగాల మధ్య ఆదివారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఆర్జీ, బీఎస్‌ఎఫ్‌ భద్రతా బలగాలు తడోకీ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి. ఉదయం 11 గంటల సమయంలో మావోయిస్టులు వీరికి తారసపడి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు ఆత్మరక్షణకు తిరిగి కాల్పులు ఆరంభించడంతో మావోయిస్టులు గాయాలపాలై అక్కడినుంచి తప్పించుకు వెళ్లిపోయారు. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలోని మావోయిస్టు శిబిరాలను కూల్చివేశాయి. ఘటన వివరాలను కాంకేరు జిల్లా పోలీసు ఉన్నతాధికారి దివ్యాంగ్‌ పటేల్‌ విలేకరులకు తెలిపారు. మరోవైపు సుక్మా జిల్లా మర్కగుడ-ముక్రం అటవీ ప్రాంతాల్లో ఐఈడీ బాంబులు పేలి ఓ మావోయిస్టు మృతి చెందాడు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బాంబులను అమర్చుతుండగా ఒక్కసారిగా పేలడంతో ఓ మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందగా మృతదేహాన్ని తోటి మావోయిస్టులు తీసుకెళ్లిపోయారు.

అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బండారిగూడెం క్రాస్‌ రోడ్డు సమీపంలో ఆదివారం కరపత్రాలు వెలిశాయి. అక్కడి బస్‌షెల్టర్‌ వద్ద వీటిని వదిలారు. బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని, భాజపాకు మద్దతిచ్చే అవకాశవాద భారాస నాయకులను తరిమి, ప్రతిపక్ష పార్టీ నాయకులను నిలదీయాలని కరపత్రాల్లో పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *