USA : పశ్చిమాసియాకు అణు జలాంతర్గామిని తరలించిన అమెరికా..!

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముదిరే కొద్దీ అమెరికా తన శక్తిమంతమైన ఆయుధ వనరులను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఒహియో శ్రేణి అణు జలాంతర్గామిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ట్విటర్‌లో ప్రకటించింది. అమెరికా నౌకా దళంలో మొత్తం నాలుగు ఒహియో శ్రేణి జలాంతర్గాములున్నాయి. కచ్చితంగా దేనిని అక్కడికి తరలించిందో మాత్రం వెల్లడించలేదు. యూఎస్‌ఎస్ ఫ్లోరిడా మాత్రం ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తోంది. ఈ జలాంతర్గాముల్లో కనీసం 154 టోమహాక్ క్షిపణులు ఉంటాయి. ఒక గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్‌లో ఉండే వాటి కంటే ఇవి 50 అదనం అన్నమాట. దాదాపు 1000 కిలోల వార్‌హెడ్‌తో ఈ క్షిపణులు దాడి చేయగలవు.
2011లో ఆపరేషన్ ఒడెస్సా డాన్‌లో భాగంగా యూఎస్‌ఎస్ ఫ్లోరిడా జలాంతర్గామి దాదాపు 100 టోమహాక్ క్షిపణులను లిబియాపై ప్రయోగించింది. సాధారణంగా బాలిస్టిక్ మిసైల్, గైడెడ్ మిసైల్ సబ్‌మెరైన్ల కదలికలను అమెరికా సైన్యం అత్యంత అరుదుగా మాత్రమే బహిర్గతం చేస్తుంది. తాజాగా సబ్‌మెరైన్ ఫొటోతో సహా సెంట్రల్‌కమాండ్ ట్విటర్‌లో పోస్టు చేయడం గమనార్హం. ఇక ఇప్పటికే రెండు అమెరికా విమాన వాహక నౌకలను ఈ ప్రాంతంలో మోహరించింది.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ పశ్చిమాసియాలో వివిధ దేశాలకు సుడిగాలి పర్యటనలు జరుపుతున్న సమయంలో ఈ జలాంతర్గామిని పంపడం గమనార్హం. బ్లింకన్ ఆదివారం పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో భేటీ అయ్యారు. శనివారం అరబ్ దేశాల విదేశాంగ మంత్రులతో, పాలస్తీనా సీనియర్ అధికారులతో ఆయన జోర్డాన్ రాజధాని అమ్మన్‌లో సమావేశమైన విషయం తెలిసిందే.
కొన్ని నెలల క్రితం దక్షిణ కొరియాకు మద్దతుగా యూఎస్‌ఎస్ మిచిగాన్‌ను పంపిన విషయం తెలిసిందే. ఓ పక్క ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఈ చర్య తీసుకొంది.