#National News

High-speed aircraft – శరవేగంతో పయనించే భవిష్యత్‌తరం విమానం

సైన్స్‌ కాల్పనిక సాహిత్యాన్ని తలపించే విమానం వాస్తవ రూపంలోకి రానున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న లోహవిహంగాల ఆకృతి, వేగం త్వరలో మారనుంది. ‘స్కై ఓవీ’ పేరుతో ఒక వినూత్న విమాన డిజైన్‌ను బార్సిలోనాకు చెందిన డిజైనర్‌ ఆస్కార్‌ వినల్స్‌ రూపొందించారు. దాని ఊహా చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘‘భవిష్యత్‌తరం వాణిజ్య విమానాలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

ఆస్కార్‌ వినల్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విమానాన్ని బ్లేడ్‌లెస్‌ టర్బోజెట్‌ ఇంజిన్లతో రూపొందిస్తున్నారు. అందులో 300 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. సరకులను తీసుకెళ్లవచ్చు. అందులో విలాసవంతమైన సాధనాలు ఉంటాయి. అది గంటకు 1,850 కిలోమీటర్ల వేగంతో అవలీలగా ప్రయాణిస్తుంది. అతి తక్కువ హైడ్రోజన్‌ ఇంధనాన్ని వినియోగించుకొని సుదీర్ఘ దూరాలను చేరుకుంటుంది. కర్బన ఉద్గారాలను వెలువరించదు. ఈ విమానాలను ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచాక దాని రెక్కలను మూసుకుపోయేలా చేయొచ్చు. ఫలితంగా విమానాశ్రయంలో స్థలాన్ని ఆదా చేసుకోవచ్చు.
ఈ భవిష్యత్‌ విమానాల ఇంజిన్లు చాలా తేలికగా ఉంటాయని వినల్‌ కంపెనీ వెబ్‌సైట్‌ పేర్కొంది. నిశ్శబ్దంగా పనిచేస్తూ మరింత సమర్థంగా ప్రయాణిస్తాయని తెలిపింది. ‘‘ప్రస్తుతం ఉన్న విమాన ప్రయాణాల కంటే వీటిలో ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. విశాలమైన స్థలం, ప్రత్యేకమైన వస్తువులు, లగ్జరీ వసతులు.. తదితర సౌకర్యాలుంటాయి. మా విమానాల డిజైన్‌పై కొనసాగుతున్న పరిశోధనను వినియోగించి కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంపై దృష్టి సారించాం. దాంతో భవిష్యత్తులో అద్భుతమైన విమాన ఆవిష్కరణలు సృష్టిస్తాం’’ అని వెల్లడించింది.

గతంలో ఇదే డిజైనర్‌ కంపెనీ ఓ ‘ఊహాజనిత విమానం’ గురించి ప్రకటించింది. అందులో కూర్చొని న్యూయార్క్‌ నుంచి లండన్‌కు కేవలం 80 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తి చేయొచ్చని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి ‘హైపర్‌ స్టింగ్‌’ అని పేరు పెట్టింది. ఆ విమానం ప్రపంచంలోనే చివరి వాణిజ్య సూపర్‌సోనిక్‌ జెట్‌ ‘కంకార్డ్‌’ కంటే రెండు రెట్లు పెద్దగా ఉండి, రెండు రెట్లు వేగంగా ప్రయాణిస్తుందని చెప్పి సంచలనం సృష్టించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *