Hamburg – విమానాశ్రయంలో వీడిన ఉత్కంఠ

జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్పోర్ట్లో ఉత్కంఠకు తెరపడింది. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన దుండగుడిని 18 గంటల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఉన్న అతడి కుమార్తె కూడా క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ దుండగుడు కారు సాయంతో విమానాశ్రయంలోకి దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత దుండగుడు కారును ఓ విమానం కింద పార్క్ చేశాడు. కారులో ఓ చిన్నారి కూడా ఉండటంతో ఆమెను రక్షించేందుకు పోలీసులు అతడితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. చివరకు నిందితుడిని అరెస్టు చేయడంతో కథ సుఖాంతమైంది. అంతకుముందు తన కుమార్తెను అపహరించుకుపోయాడంటూ అతడి భార్య పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె బాలికతో కలిసి స్టేజ్లో ఉండగా.. నిందితుడు చిన్నారిని బలవంతంగా లాక్కొనిపోయాడని జర్మన్ వార్తా సంస్థ ఎన్డీఆర్ పేర్కొంది. చర్చల ద్వారా అతడి చెరలో ఉన్న బాలికను విడిపించడానికి పోలీసులు ప్రయత్నించారు. 18 గంటల తర్వాత దుండగుడిని అత్యవసర సేవల అధికారులు అరెస్టు చేసినట్లు హాంబర్గ్ పోలీసులు ప్రకటించారు. దీంతో విమాన కార్యకలాపాల ప్రారంభానికి చర్యలు తీసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.