Delhi – ట్రక్కుల ప్రవేశంపై నిషేధం

దేశ రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచీలు క్షీణిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాయు కాలుష్య నియంత్రణకు నాలుగో దశ కింద కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా దిల్లీలోకి అత్యవసర సేవలను అందించే వాహనాలు మినహా వాయు కాలుష్య కారక ట్రక్కులు, నాలుగు చక్రాల వాణిజ్య వాహనాల ప్రవేశంపై నిషేధం విధించింది. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్ 4 వాహనాలను మాత్రమే రాజధాని ప్రాంతంలోకి అనుమతించాలని పేర్కొంది.. హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓవర్‌బ్రిడ్జ్‌లు, పవర్ ట్రాన్స్‌మిషన్, పైప్‌లైన్‌లు తదితర పబ్లిక్ ప్రాజెక్ట్‌లతో పాటు అన్ని రకాల నిర్మాణం, కూల్చివేత కార్యకలాపాలపైనా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య నియంత్రణకు అన్ని అత్యవసర చర్యలు అమలు చేయాలని దిల్లీ, రాజధాని ప్రాంతం పరిధిలోని రాష్ట్రాలను కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో, మిగతా సిబ్బంది ఇంటి నుంచి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలలకు సెలవులను మరో ఐదు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో నవంబరు 5 వరకు ఇచ్చిన సెలవులను.. తాజాగా నవంబరు 10 వరకు పొడిగించింది. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఆదివారం కూడా రాజధాని ప్రాంతంలో విషపూరిత పొగ మంచు కమ్ముకుంది. ఆదివారం దిల్లీలో వాయు నాణ్యత సూచీ (ఏఐక్యూ)486గా ఉంది. శనివారంతో (504గా ఉంది) పోలిస్తే స్వల్పంగా తగ్గింది.