Israle-Hamas Conflict : గాజాపై యుద్ధానికి అమెరికాదే పూర్తి బాధ్యత

అమెరికా యుద్ధ నౌకలకు(US Naval Fleet) బయపడేది లేదని మిలిటెంట్ గ్రూప్ హెజ్‌బొల్లా(Hezbollah) చీఫ్ హసన్ నస్రల్లా పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas Conflict) లెబనాన్‌లోకి విస్తరించేందుకు అన్ని మార్గాలు తెరుచుకొని ఉన్నాయన్నారు. హమాస్ మిలిటెంట్లు- ఇజ్రాయెల్ సైన్యం(IDF) మధ్య యుద్ధం మొదలైన ఇన్ని రోజుల తర్వాత హెజ్‌బొల్లా అధిపతి నస్రల్లా తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. గాజాపై యద్ధానికి అమెరికాదే బాధ్యత అన్నారు. పాలస్తీనా భూభాగంలో దాడులను ఆపడం ద్వారా ప్రాంతీయ మంటలను వాషింగ్టన్ నిరోధించగలదన్నారు. ఈయుద్ధం ఒక కీలక అంశమని, నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. లెబనాన్‌లోని బీరుట్‌లో నస్రుల్లా ప్రసంగించారు. దీన్ని టెలివిజన్‌లో ప్రసారం చేశారు.
‘‘గాజా ప్రజలపై జరుగుతున్న దాడులకు అమెరికా మొత్తంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ కేవలం దీన్ని అమలు చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతోంది. ప్రాంతీయ మంటలను చల్లార్చుదామనుకుంటున్న అమెరికా తక్షణమే గాజాపై యుద్ధాన్ని ఆపాలి. కాల్పుల విరమణ, దురాక్రమణకు వెంటనే ముగింపు పలకాలి’’ అని హసన్ నస్రుల్లా పేర్కొన్నారు. లెబనాన్‌పై దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. లేకుంటే లెబనీస్ ఫ్రంట్ రంగంలోకి దిగేందుకు అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయన్నారు. మధ్యధరా సముద్రంలో మోహరించిన నౌకాదళంతో తమను భయపెట్టలేరని అమెరికాను నస్రల్లా హెచ్చించారు. వారి యుద్ధనౌకలతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ పోరు రోజురోజుకు తీవ్రం రూపం దాలుస్తోంది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటు భూతల దాడులకు దిగడంతో ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. ఇక హమాస్ మిలిటెంట్లు ట్యాంకు విధ్వంసక క్షిపణులు, గ్రనేడ్లును ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో 9వేలకు పైగా పాలస్తానీయులు మరణించారు. వీరిలో 3,600 మంది చిన్నారులు ఉన్నారు. వేల సంఖ్యలో క్షతగాత్రులున్నారు. మరోవైపు హమాస్‌పై ఇజ్రాయెల్ దాడికి దిగడంతో హెజ్‌బొల్లా లెబనాన్ నుంచి దాడులు చేస్తోంది. హమాస్‌కు మద్దతు ప్రకటించి సైనిక పోస్టులు, ట్యాంకులపై దాడులకు పాల్పడుతోంది. దీంతో ఇజ్రాయెల్ సైతం లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై దాడులకు దిగుతోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 54 మంది హెజ్‌బొల్లా మిలిటెంట్లు చనిపోయినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ వైపు ఆరుగురు సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారు.