Israel – హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు..!

లెబనాన్‌లోని హెజ్బొల్లా(Hezbollah)కు చెందిన కీలక లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం నేడు దాడులు చేపట్టింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్ ఎక్స్ ఖాతాలో కూడా ధ్రువీకరించింది. లెబనాన్ నుంచి గత కొన్నాళ్లుగా తరచూ దాడులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌లో హెజ్బొల్లా.. రాజకీయ, సైనిక, సామాజిక కార్యక్రమాల్లో చాలా బలంగా ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని అమాయక ప్రజలపై దాడి చేసిన హమాస్‌కు ఇది మద్దతు ప్రకటించింది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్ సైనిక పోస్టులపై, ట్యాంక్‌లపై దాడులకు పాల్పడుతోంది. హమాస్ సైనిక లక్ష్యాలపై తమ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ వాయుసేన ట్వీట్ చేసింది. దీంతోపాటు సరిహద్దుల్లో హెజ్బొల్లా చేపట్టిన శతఘ్ని దాడులను ఇజ్రాయెల్ బలగాలు తిప్పికొడుతున్నాయి.
‘నన్ను విడిపించండి ప్లీజ్’.. హమాస్ చెరలో బందీ వీడియో బయటకు..!
మరోవైపు హమాస్‌పై కూడా ఇజ్రాయెల్ ఎడతెగని విధంగా దాడులు చేస్తోంది. సోమవారం రాత్రి గాజా పట్టీలోని 200 హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొంది. ఈ దాడుల్లో హమాస్ హెడ్‌క్వార్టర్, ఆ సంస్థ ఉపయోగించే బ్యాంక్ ఉన్నాయి. తమ నౌకాదళం కూడా హమాస్‌పై దాడులు మొదలుపెట్టిందని ఇజ్రాయెల్ వెల్లడించింది. ముఖ్యంగా హమాస్ కమాండ్ సెంటర్, ఆయుధాగారాలను లక్ష్యంగా చేసుకొందని పేర్కొంది. ఈ దాడుల్లో హమస్ సురా కౌన్సిల్ అధిపతి ఒసామా మజిని మరణించినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. 2006లో కిడ్నాప్‌నకు గురైన గిలిద్ వ్యవహారాలను ఇతడే చూసినట్లు వెల్లడించింది.