Flash Floods : సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి మృతి..

సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరినట్లు ఆ రాష్ట్ర అధికారులు సోమవారం తెలిపారు. మృతుల్లో 10 మంది సైనికులు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఆచూకీ దొరకని 105 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తీస్తా నదితీర ప్రాంతంలో 40 మృతదేహాలను వెలికితీసినట్లు పశ్చిమ బెంగాల్ అధికారులు తెలుపగా.. రెండు రాష్ట్రాలు చెప్పిన గణాంకాల్లో కొన్ని రెండు సార్లు లెక్కించి ఉండొచ్చని సిక్కిం అధికారులు చెబుతున్నారు. అలాగే వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులని రక్షించేందుకు భారత వైమానిక, ఆర్మీ దళాలు రంగంలోకి దిగాయి. ఉత్తర సిక్కింలోని లాచెన్ నుంచి మంగన్కు మొదటి పర్యాటక బృందాన్ని వైమానిక దళం తరలించింది. దీంతో పాటు లాచంగ్ నుంచి ప్యాక్యంగ్ ఎయిర్పోర్టుకు 77 మంది పర్యాటకులను తరలించింది. రానున్న అయిదురోజుల్లో సిక్కిం, పశ్చిమబెంగాల్లో తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు పడొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది.