Modi praises – ‘ది వ్యాక్సిన్ వార్’

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ (The Vaccine War). ఈ సినిమాపై ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసలు కురిపించారు. ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ప్రస్తావించారు.
‘కరోనా సమయంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు నిరంతరం కష్టపడి పనిచేశారు. దీని గురించి ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమా వచ్చిందని విన్నాను. మహిళా శాస్త్రవేత్తల విజయాలను ఇందులో చూపించారు. ఇలాంటి సినిమా తీసినందుకు ఆ చిత్ర దర్శక నిర్మాతలను నేను అభినందిస్తున్నాను. ఈ సినిమా చూశాక మన శాస్త్రవేత్తలపై ప్రతి భారతీయుడికి గౌరవం పెరిగింది’ అని మోదీ పేర్కొన్నారు. దీనిపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. ‘‘మోదీ నాయకత్వంలో స్వదేశీ వ్యాక్సిన్ తయారు చేశారు. దీని తయారీలో మహిళా సైంటిస్టుల కృషిని గుర్తించి.. మోదీ ప్రస్తావించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రధాని ప్రశంసించడంపై శాస్త్రవేత్తలు నాకు ఫోన్ చేసి ఉద్వేగానికి లోనయ్యారు’’ అంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై కూడా మోదీ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఇక ‘ది వ్యాక్సిన్ వార్’ విషయానికొస్తే.. సెప్టెంబర్ 28న ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, సప్తమి గౌడ, రైమా సేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్తల గురించి చాటి చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.