‘Teesta’ Floods : సిక్కిం నుంచి బెంగాల్‌కు

కుంభవృష్టితో అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) ఇంకా వరద (Floods) గుప్పిట్లోనే ఉంది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన అతి భారీవర్షానికి తీస్తా నది ఉప్పొంగడంతో ఆకస్మికంగా వరద (Flash Floods) పోటెత్తింది. ఈ వరదల్లో మృతుల సంఖ్య 14కు పెరగ్గా.. మొత్తం 102 మంది గల్లంతయ్యారు. ఇందులో 22 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అటు ఈ వరద ప్రభావం పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ (West Bengal)ను తాకింది. తీస్తా నది ఉద్ధృతికి దిగువనున్న ప్రాంతాలకు భారీగా వరద చేరింది. సరిహద్దుల్లో బెంగాల్ వైపు ప్రాంతాలను వరద ముంచెత్తింది. బెంగాల్‌లోని కాళింపాంగ్ జిల్లాలో గల తీస్తా బజార్‌లో ఇళ్లలోకి వరద చేరింది. తీర ప్రాంతాల్లోని ఇళ్లు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్లల్లో మొదటి అంతస్తు వరకు నీరు చేరింది.
వరదల ధాటికి సిక్కిం వ్యాప్తంగా 11 వంతెనలు కొట్టుకుపోయాయి. పశ్చిమబెంగాల్, సిక్కింను కలిపే 10వ నంబరు జాతీయ రహదారి దెబ్బతింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 3,000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వంతెనలు, రహదారులు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అటు వాతావరణం కూడా అనుకూలించట్లేదని అధికారులు చెబుతున్నారు.
రాత్రికి రాత్రే సంభవించిన ఈ ఆకస్మిక వరదలతో సిక్కింలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కళ్లముందే వరద దూసుకురావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ‘‘బుధవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి మా ఇంటికి కొద్ది దూరం వరకు వరద చేరింది. అప్పటికే పోలీసులు అక్కడకు వచ్చి మమ్మల్ని దగ్గర్లోని శిబిరాలకు వెళ్లమని చెప్పారు. కేవలం సూట్‌కేస్‌లతో వెళ్లిపోయాం’’ అని ఓ మహిళ ఆవేదన వెళ్లగక్కారు. చాలా ప్రాంతాల్లో వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది.