Tensions between Canada – India – కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతలు

భారత్లో ఉన్న దౌత్యసిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని దిల్లీ అల్టిమేటం జారీ చేయడంపై కెనడా స్పందించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తమ దౌత్యవేత్తల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమయంలో భారత్తో తెరవెనుక చర్చలను కొనసాగిస్తామని చెప్పింది. ‘‘భారత్లో ఉన్న మా దౌత్యవేత్తల భద్రతను కెనడా ప్రభుత్వం చాలా కీలకంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వంతో మేము సమన్వయంతో ఉంటాము. ఆ దేశంతో తెరవెనుక దౌత్య చర్చలను కొనసాగిస్తాం. విషయాలు బహిర్గతం కానంత వరకు దౌత్యపరమైన చర్చలే అత్యున్నత మార్గమని మేము భావిస్తున్నాం’’ అని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు.