TEJAS :వైమానిక దళంలోకి ట్విన్ సీటర్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్ ట్విన్ సీటర్ బుధవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లోకి హుందాగా అడుగుపెట్టింది. సమకాలీన యుద్ధ అవసరాలకు అనువుగా తయారైన ఈ యుద్ధ విమానం నమూనాను బెంగళూరులో వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరికి హెచ్‌ఏఎల్ సీఎండీ సి.బి.అనంతకృష్ణన్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తుల తయారీకి నేతృత్వం వహించే హెచ్‌ఏఎల్ స్ఫూర్తికి శాల్యూట్ అన్నారు. వచ్చే ఏడాదిలోగా 97 ఎల్‌సీఏలను కొనుగోలు చేస్తే.. ఐఏఎఫ్ అమ్ముల పొదిలో వాటి సంఖ్య 220కు పెరుగుతుందని వి.ఆర్.చౌధరి వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా అన్ని తేజస్ ట్విన్ సీటర్లనూ ఐఏఎఫ్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలోగా అందించేందుకు హెచ్‌ఏఎల్ సిద్ధంగా ఉందని ఆ సంస్థ సీఎండీ సి.బి.అనంతకృష్ణన్ తెలిపారు. అధునాతన వ్యవస్థలతో తయారైన ఎల్‌సీఏ తేజస్.. అరుదైన యుద్ధ సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల వరుసలో భారత్‌ను చేర్చిందని హెచ్‌ఏఎల్ ప్రకటించింది.