Type 2 Diabetes – టైప్ 2 మధుమేహంతో ఆయుక్షీణం

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రుగ్మత మన సగటు ఆయుర్దాయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయమై లాన్సెట్ విస్మయకరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్‌కు దారితీసే టైప్-2 మధుమేహం(Diabetes) సగటు జీవిత కాలాన్ని ఏ విధంగా తగ్గిస్తుందో విస్తృత అధ్యయనాల ఆధారంగా వివరించింది. 30 ఏళ్ల వయసులో టైప్-2 మధుమేహం వస్తే…సగటు ఆయుర్దాయం 14 ఏళ్ల వరకు క్షీణిస్తుందని తెలిపింది. 40 ఏళ్ల వయసులో ఈ రుగ్మతకు గురైతే పదేళ్లు, 50ఏళ్లప్పుడు వస్తే కనీసంగా ఆరు సంవత్సరాలు ముందుగానే మృత్యువాత పడే అవకాశం ఉందని పేర్కొంది. అధిక ఆదాయం ఉన్న 19 దేశాల్లోని 15 లక్షల మంది ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చినట్లు ‘ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ’లో ప్రచురితమైన నివేదిక వివరించింది. యువత టైప్-2 మధుమేహానికి గురికాకుండా నివారించడం, సాధ్యమైనంత వరకు జాప్యం చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల మరణాల ముప్పును తగ్గించవచ్చని సూచించింది. ఊబకాయం, నాణ్యతలేని ఆహారం, అధిక సమయం కూర్చునే ఉండడం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ప్రపంచవ్యాప్తంగా టైప్-2 మధుమేహం అధికమవడానికి దోహదపడుతున్నాయని వివరించింది. ఈ రుగ్మతకు గురయ్యే యువత సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. కేంబ్రిడ్జి, గ్లాస్గో విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ నివేదికను రూపొందించింది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఈ పరిశోధన కొనసాగింది. ఫలితాలు దాదాపు సమానంగానే ఉన్నాయని ప్రొఫెసర్ ఇమాన్యులే డి ఏంజెలాంటోనియో తెలిపారు.