#National News

Sikkim : సిక్కింలో మెరుపు వరదలు..

ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)లో ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. నిన్న రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లాచెన్‌ లోయలో గల తీస్తా నది (Teesta River) ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి. ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బంది (Army Personnel) గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో చుంగ్‌థాంగ్‌ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఫలితంగా దిగువ ప్రాంతంలో నీటిమట్టం 15-20 అడుగుల మేర పెరిగింది. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ మెరుపు వరదలు (Floods) సంభవించాయి.

వరదల తీవ్రతకు లాచెన్‌ లోయలోని ఆర్మీ పోస్టులు నీట మునిగాయి. సింగ్తమ్‌ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. అందులోని 23 మంది సిబ్బంది గల్లంతైనట్లు ఈస్ట్రన్‌ కమాండ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. 41 వాహనాలు నీటమునిగినట్లు తెలిపింది. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేదు. దీంతో అక్కడి ఆర్మీ సిబ్బందిని కమాండ్‌ స్థాయి అధికారులు సంప్రదించడం కష్టంగా మారిందని సైనిక వర్గాలు వెల్లడించాయి.

ఇక తీస్తా నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తమ్‌ ఫూట్ బ్రిడ్జ్‌ కుప్పకూలింది. అటు పశ్చిమ బెంగాల్‌, సిక్కింను కలిపే 10వ నంబరు జాతీయ రహదారి చాటా చోట్ల కొట్టుకుపోయింది. మెరుపు వరదలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు నీటమునిగాయి. వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌ స్పందించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి.. అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అటు తీస్తా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *