National Employment Guarantee Scheme : జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు

గ్రామీణ స్థాయిలో కూలీలకు ఉపాధి కల్పించడం, పొలాల్లో అభివృద్ధి పనులు చేపట్టడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా 100 రోజుల పాటు కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిధుల కేటాయింపు అనంతరం వినియోగం పట్ల ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, కల్లాల నిర్మాణం, డంపింగ్ షెడ్డుల ఏర్పాటు, హరితహారం, నర్సరీల నిర్వహణతో పాటు వ్యవసాయ సంబంధిత అభివృద్ధి పనులు చేపట్టడం, కూలీల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. 2021 జూన్ నుంచి 2023 మార్చి వరకు అచ్చంపేట మండలంలో ఉపాధి హామీ ద్వారా వివిధ పనుల కోసం రూ.11.90 కోట్లు కేటాయించారు. నిధుల వినియోగంపై 2023 ఆగస్టులో నిర్వహించిన ప్రజా వేదికలో రూ.87 వేలు అక్రమాలు జరినినట్లు గుర్తించి అధికారులు తిరిగి వసూలు చేయాలని ఆదేశించారు. సిబ్బందికి రూ.51 వేలు జరిమానా విధించగా రూ.61 వేలు వసూలు చేశారు.
జిల్లాలోని 10 మండలాల్లో నిర్వహించిన ప్రజా వేదికల్లో అక్రమాలను గుర్తించిన అధికారులు రికవరీకి ఆదేశించారు. మొత్తం రూ.4.25 లక్షలు రికవరి, రూ.2.52 జరిమానా విధించగా అధికారులు ఇప్పటి వరకు రూ.4 లక్షలను వసూలు చేసినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఏటా ఉపాధి పనుల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నప్పటికి ఆశించిన స్థాయిలో అధికారులు కట్టడి చేయడం లేదనే ఆరోపణలున్నారు. ప్రజావేదికలో గుర్తించిన అక్రమాలపై జిల్లా అదనపు డీఆర్డీవో రాజేశ్వరిని వివరణ కోరగా అధికారుల విచారణలో ఆధారాలు లభ్యమైతే జరిమానా విధించి పక్బందీగా వసూలు చేస్తామన్నారు.