Oscar 2024 – అధికారిక ఎంట్రీ మలయాళ బ్లాక్‌బస్టర్

: ‘ఆస్కార్ 2024’ (Oscar 2024) అవార్డుల కోసం భారత్ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్ ‘2018’ (2018 movie) అధికారికంగా ఎంపికైనట్లు పీటీఐ వార్త సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘2018’ని ఎంపిక చేశారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రమిది. ‘2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆద్యంత భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దిన ఈ సినిమా మలయాళంతో పాటు, ఇతర భాషల సినీ ప్రేక్షకులతోనూ కన్నీళ్లు పెట్టించింది. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఏటా వివిధ దేశాలు ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో తమ చిత్రాలను అకాడమీకి పంపుతాయి. ఈ క్రమంలో ‘ఆస్కార్ 2024’ (Oscar 2024) అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడ్డాయి. ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ సినిమాలను వీక్షించింది. మొత్తం 22 చిత్రాలను కమిటీ వీక్షించి, చివరకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరి కోసం ‘2018’ సినిమాను కమిటీ ఎంపిక చేసింది. ఆమిర్‌ఖాన్ ‘లాగాన్’ తర్వాత ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రమూ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ బరిలో తుది వరకూ నిలవలేదు. అంతకుముందు ‘మదర్‌ఇండియా’, ‘సలామ్ బాంబే’ చిత్రాలను మాత్రమే ఈ కేటగిరిలో పోటీ పడ్డాయి.