Interpol – ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్వీర్ సింగ్ కోసం కార్నర్ నోటీసు జారీ చేసింది.

తాజాగా తమ అధికారిక వెబ్సైట్లో దీనికి సంబంధించి వివరాలు పొందుపరిచింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘బాబర్ ఖాల్సా ఇంటర్నేషనల్’ గ్రూప్‌నకు చెందిన కరణ్వీర్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇంటర్‌పోల్ వెల్లడించిన వివరాల ప్రకారం 38 ఏళ్ల కరణ్వీర్ సింగ్ పంజాబ్‌లోని కపుర్తాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతడిపై భారత్‌లో హింసకు కుట్ర, హత్యలు, ఉగ్రవాద సంస్థలకు నిధుల సేకరణ, ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా వ్యవహరించడం తదితర నేరారోపణలు ఉన్నాయి. దీంతో భారత్ కరణ్వీర్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది.
భారత్-కెనడా(India Canada Row) మధ్య ఖలిస్థాన్ వివాదం కొనసాగుతున్న వేళ ఇటీవల భారతీయులను బెదిరించిన సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జె) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూకు చెందిన పంజాబ్‌లోని ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)(NIA) జప్తు చేసింది. ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న గురుపత్వంత్ సింగ్ పన్నూను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) 2019లో మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఇంటర్‌పోల్ రెండుసార్లు తిరస్కరించింది. మరోవైపు 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదులకు చెందిన ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసేందుకు సిద్ధం అవుతోంది.