#National News

‘India-West Asia-Europe’- ప్రపంచ వాణిజ్యానికి కీలకం.

రాబోయే కొన్ని వందల ఏళ్లపాటు ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ‘భారత్‌- పశ్చిమాసియా- ఐరోపా’ నడవా (కారిడార్‌) నిలవబోతోందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఈ నడవాకు భరతభూమి శ్రీకారం చుట్టిందనేది చరిత్రలో నమోదవుతుందని ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో పేర్కొన్నారు. వర్తకంలో బలీయశక్తిగా మనదేశం ఉన్నప్పుడు ‘సిల్క్‌ రూట్‌’ను ప్రాచీనకాలం నుంచి వాడుకునేదని గుర్తుచేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు ద్వారా సరికొత్త కారిడార్‌ను మన దేశం సూచించిందని చెప్పారు. ‘‘చంద్రయాన్‌-3 విజయవంతం కావడం, ఆ వెంటనే జీ20 సదస్సు ఘనంగా పూర్తికావడంతో దేశ ప్రజల్లో ఆనందం రెట్టింపు అయింది. ఇస్రో యూట్యూబ్‌ ఛానల్‌లో 80 లక్షల మందికిపైగా ప్రజలు చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అదొక రికార్డు. ప్రజల నుంచి నాకు అందిన అభినందన సందేశాల్లో ఎక్కువ శాతం ఈ రెండింటికి సంబంధించినవే. జీ20లో ఆఫ్రికన్‌ యూనియన్‌ను చేర్చడంలో విజయవంతం కావడం ద్వారా భారత నాయకత్వాన్ని ప్రపంచం ఆమోదించినట్లయింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఆ సదస్సు నిర్వహించిన భారత్‌ మంటపం ఒక ప్రసిద్ధ కట్టడంగా మారిందని, ప్రజలు అక్కడ స్వీయచిత్రాలు తీసుకుంటున్నారని చెప్పారు.

వచ్చేనెల 2న జరగనున్న మహాత్మాగాంధీ జయంతిని ప్రధాని ప్రస్తావిస్తూ.. జీ20 సదస్సుకు వచ్చిన నేతలంతా రాజ్‌ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించిన దృశ్యాన్ని ఎవరూ మరిచిపోలేరని అన్నారు. ‘‘గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా అక్టోబరు 1న ఉదయం 10 గంటలకు పెద్దఎత్తున జరిగే పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలి. తమ చుట్టుపక్కల ప్రాంతాలను, బహిరంగ స్థలాలను శుభ్రపరచుకోవాలి. అదే మహాత్మునికి నిజమైన నివాళి. ఖాదీ ఉత్పత్తుల్ని కూడా కొనండి. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం. కనిష్ఠ పెట్టుబడితో గరిష్ఠ ఉపాధిని సృష్టించడం ఈ రంగంతో సాధ్యం. మంచితనంతో మెలగడం ద్వారా పర్యాటకుల్ని ఆకట్టుకోవచ్చు. గత కొన్నేళ్లుగా మన దేశ ఖ్యాతి పెరుగుతోంది. జీ20తో అది మరింత పెరిగింది. దాదాపు లక్షమంది ప్రతినిధులు దేశంలో భిన్న ప్రాంతాలకు వెళ్లి భిన్నత్వాన్ని, వేర్వేరు రుచులను, సంస్కృతుల్ని చూశారు. ఆ అనుభవాలను తమవెంట మోసుకువెళ్లారు. పర్యాటక రంగ విస్తరణకు అది మరింత ఊతమిస్తుంది’’ అని వివరించారు.

చూపు లేకపోయినా 21 ఏళ్ల జర్మనీ యువతి కశ్మీ వివిధ భారతీయ భాషల్లో అద్భుతంగా పాటలు పాడుతుండడాన్ని, నైనీతాల్‌లో మారుమూల గ్రామాల్లోని పిల్లల కోసం గుర్రంపై సంచార గ్రంథాలయాన్ని యువకులు నడిపిస్తుండడాన్ని ప్రధాని అభినందించారు. ఎవరిపనులు వారు చేస్తూనే ఎన్నో మార్పులు సాధించవచ్చన్నారు. స్థానిక ఉత్పత్తుల్ని కొనడం ద్వారా ఎంతోమందికి నేరుగా లబ్ధి కలిగించినట్లవుతుందని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *