#National News

Development – అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిణామం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. నక్సల్‌ ప్రభావిత జిల్లా కాంకర్‌లోని భైంసాకన్హర్ గ్రామంలో  93 ఏళ్ల వృద్ధుడు తొలిసారి తన ఓటును నమోదు చేసుకున్నారు. దాంతో ఆయన త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. (vote for first time)

అర్హులై ఉండి, ఓటర్ల జాబితాలో లేని వారిని చేర్చేందుకు జిల్లా యంత్రాంగం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా  93 ఏళ్ల షేర్‌ సింగ్‌ హెడ్కో(Sher Singh Hedko) ఇంటికి అధికారులు వెళ్లారు. ఇంతవరకు ఆయనకు ఓటు హక్కు లేదని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఓటు హక్కు కోసం సింగ్ సమర్పించిన పత్రాల్లోని లోపాల వల్లే ఇంతకాలం ఆయన పేరు చేరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని ప్రక్రియలు పూర్తి చేసి, ఆయన పేరు చేర్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత నుంచి హెడ్కో ఓటు వేసేందుకు ఉత్సాహంగా  ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన వయసురీత్యా సరిగా మాట్లాడలేకపోతున్నారని చెప్పారు.

అలాగే ఇతర జిల్లాలైన అంతాగఢ్‌, భానుప్రతాపూర్ జిల్లాలోని పలువురు వృద్ధుల పేర్లను కూడా తాజాగా జాబితాలో చేర్చారు. దీనిపై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను కాంకర్ జిల్లా కలెక్టర్ ప్రియాంకా శుక్లా అభినందించారు. ఇది చెప్పుకోదగ్గ పరిణామమని వ్యాఖ్యానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *