Singapore’s sensational – సింగపూర్ సంచలనం కేసులో 175 కోట్ల అక్రమ

సింగపూర్‌లో గత నెలలో పోలీసులు గుర్తించిన భారీ నగదు అక్రమ చలామణి కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి తాజాగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. 68 బంగారు కడ్డీలు, 294 విలాసవంతమైన బ్యాగులు, 164 లగ్జరీ గడియారాలు, 546 ఆభరణాలు, 204 ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 3.8 కోట్ల సింగపూర్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీనీ జప్తు చేశారు. మొత్తంగా ఇప్పటివరకూ ఈ కేసులో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 240 కోట్ల సింగపూర్ డాలర్లకు (175 కోట్ల అమెరికా డాలర్లు) చేరుకుంది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వంటి రకరకాల విధానాల్లో ఈ నగదు అక్రమ చలామణి కుంభకోణం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సైప్రస్, తుర్కియే, చైనా, కంబోడియా, వనౌతులకు చెందిన తొమ్మిది మంది పురుషులు, ఓ మహిళపై అభియోగాలు దాఖలయ్యాయి. తక్కువ నేరాల రేటు ఉండే దేశంగా, ఫైనాన్షియల్ హబ్‌గా సింగపూర్‌కు ఉన్న ప్రతిష్ఠను ఈ కుంభకోణం బాగా దెబ్బతీసిందని పలువురు పేర్కొంటున్నారు.