drug suspects’ – డ్రగ్స్ అనుమానితుల సెల్ ఫోన్లలో సినీ తారల

నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేయడం, రేవ్ పార్టీలకు సినీ, రాజకీయ మిత్రులను ఆహ్వానించడం, మత్తుపదార్థాలు ఎరవేసి అమ్మాయిలను రప్పించడం, ప్రముఖుల పరిచయాలను అడ్డుపెట్టుకొని సినీ నిర్మాతలుగా అవతారమెత్తడం, ఇదీ మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవల అరెస్టయిన నిందితుల అసలు రూపం. నిందితులు బాలాజీ, రాంకిశోర్, కల్హర్‌రెడ్డి సెల్‌ఫోన్ల డేటాలో పలువురు సినీ రంగ ప్రముఖుల ఫోన్ నంబర్లను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో టీఎస్‌న్యాబ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సినీ నిర్మాతలు రవి ఉప్పలపాటి, వెంకటరత్నారెడ్డిలకు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ నేవీ ఉద్యోగి బాలాజీ, విశాఖపట్నానికి చెందిన రాంకిశోర్ ద్వారా డ్రగ్స్ చేరేవి. బెంగళూరులోని నైజీరియన్లతో బాలాజీకి పరిచయాలున్నాయి. అక్కడి నుంచి కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు తీసుకొచ్చేందుకు రాంకిశోర్ సహకరించేవాడు. కొకైన్‌ను బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ సినీ, రాజకీయ ప్రముఖులకు విక్రయించేవారు. మాదాపూర్, గచ్చిబౌలిలోని అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని పార్టీలు నిర్వహించేవారు. మోడళ్లు, సినీ అవకాశాల కోసం ఎదురుచూసే యువతులకు కొకైన్ ఎరవేసి రప్పించేవారు.
నగరంలో డ్రగ్స్ లింకులను ఛేదించేందుకు సిద్ధమైన టీఎస్‌న్యాబ్ ఇటీవల అరెస్టయిన 8 మంది నిందితులకు పోలీసు కస్టడీ కోరుతూ మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. భాస్కర్, మురళీ వెంకట రత్నారెడ్డిలను అరెస్ట్ చేసినప్పుడు బయటపడిన సమాచారంతో ఈ నెల 14న ముగ్గురు నైజీరియన్లు సహా మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌రావు, రాంచంద్, కె.సందీప్, సుశాంత్‌రెడ్డి, శ్రీకర్ కృష్ణప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 7 రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.