IT employees and TDP ranks protested in the city of Chennai on Tuesday – మంగళవారం చెన్నై నగరంలో ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు, తెదేపా శ్రేణులు చెన్నై నగరంలో మంగళవారం ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్న వల్లువర్‌కోట్టం నిరసన మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకుని నల్ల కండువాలు వేసుకుని, ప్లకార్డులతో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకోసం ఐటీ ఉద్యోగులు సెలవుపెట్టి వచ్చినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్నామని, చంద్రబాబు పాలనలో తమకు మేలే జరిగిందన్న అభిప్రాయాలను వ్యక్తంచేశారు. చంద్రబాబు అరెస్టు దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా నిలబడతామని ప్రతినబూనారు. తెలుగు ప్రజలు, ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు చంద్రబాబుకు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఆందోళనలో సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ పాల్గొన్నారు. ఇప్పటికే సినీరంగం నుంచి కొంతమంది స్పందించారని, రజనీకాంత్ కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపారని ఆయన గుర్తుచేశారు. తెదేపా చెన్నై అధ్యక్షుడు చంద్రశేఖర్, నగరి తెదేపా ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాష్, చెన్నై తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చలపతి, ఆంధ్రాక్లబ్ మాజీ అధ్యక్షుడు ఆదిశేషయ్య తదితరులు ప్రసంగించారు. ఆందోళనకు జనసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలుగువారు మద్దతు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఇండియా జననాయగ కట్చి (ఐజేకే) నుంచి కొందరు మద్దతుగా నిలిచారు.